గురుకుల మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

TSPSCగురుకుల మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేసింది TSPSC. మెరిట్‌ జాబితాను సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (CGG) గజిబిజిగా తయారు చేయడమే ఇందుకు కారణమని తెలిపింది. గురుకుల జూనియర్‌ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌, ప్రిన్సిపాల్‌ పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అభ్యర్థుల సమాచారంతోపాటు పరీక్షకు ముందు, తర్వాత నిర్వహించే ప్రక్రియ మొత్తం CGGనే చేపడుతోంది. గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్‌ సాధించిన వారి నుంచి ఒక్కో పోస్టుకు 15 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మేరకు CGG జాబితా సిద్ధం చేసి TSPSCకి పంపింది. అయితే ఈ జాబితా తయారీలోనే తప్పులు చోటుచేసుకున్నాయి. అందులో ఒక అభ్యర్థికి సంబంధించిన సమాచారాన్ని మరో అభ్యర్థికి చూపిస్తూ మెయిన్స్‌కు అర్హుల జాబితాను CGG తయారు చేసింది. అభ్యర్థుల వివరాలు కూడా గజిబిజిగా రూపొందించింది. అయితే, అభ్యర్థుల సమాచారాన్ని, ఎంపిక విధానాన్ని TSPSC మరోసారి పరిశీలించడంతో లోపాలు బయటపడ్డాయి. జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలు మ్యాచ్‌ కాలేదు. దాంతో, సంబంధిత జాబితాలను TSPSC రద్దు చేసింది. వాటిని మరోసారి పరిశీలించిన తర్వాతే గురుకుల పోస్టుల మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ప్రకటించాలని నిర్ణయించింది.

ఫిబ్రవరి 19 నుంచి మార్చి 23వ తేదీ వరకు జరగాల్సిన గురుకుల పోస్టుల మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేసింది. మెయిన్స్‌ పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనే అంశాన్ని త్వరలో ప్రకటిస్తామని TSPSC కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates