గూగుల్ మ్యాప్ తో లింక్ : మెట్రో పిల్లర్ల ఆధారంగా అడ్రస్ లు

హైదరాబాద్ లో ఇంతకు ముందు అడ్రస్ తెలుసుకోవాలంటే నానా అవస్థలు. ల్యాండ్ మార్క్ ఆధారంగా కనుక్కోవాల్సి వచ్చేంది. ఇప్పుడు మెట్రో రూట్స్ లో అడ్రస్ తెలుసుకోవడం చిటికెలో పని. మెట్రో రూట్ లో.. మెయిన్ రోడ్డు పక్కన ఉండే షాపు అడ్రస్ చెప్పాలంటే మెట్రో పిల్లర్ నెంబర్ చెబుతున్నారు. దీంతో త్వరలో హైదరాబాద్ లోని అడ్రస్‌ లన్నింటికీ మెట్రో పిల్లర్లే మూలస్తంభంగా మారనున్నాయి.

ఈ మేరకు మెట్రో రైలు పిల్లర్లను త్వరలో GPS టెక్నాలజీతో  గూగుల్‌ మ్యాప్‌ కు లింక్ చేయనున్నారు. వీటికి నంబర్లను కేటాయించడం ద్వారా పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులతో పాటు వాణిజ్య, వ్యాపార సముదాయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారనున్నాయి. LBనగర్‌–మియాపూర్, JBS – ఫలక్‌ నుమా, నాగోల్‌–రాయదుర్గం మూడు మెట్రో కారిడార్లలో 66 కి.మీ. రూట్స్ లోని 2 వేల541 మెట్రో పిల్లర్లకు దశలవారీగా నంబర్ల కేటాయింపు ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే ప్రకాశ్‌నగర్‌–రసూల్‌ పురా రూట్ లో C1, 300–C1,350 వరకు పిల్లర్లకు నంబర్లు కేటాయించారు. నీలిరంగు బోర్డుపై తెలుపు అక్షరాలతో వీటిని గుర్తుగా ఏర్పాటు చేశారు. భవిష్యత్‌ లో పెద్ద సైజులో అందరికీ కనిపించేలా రేడియంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి HMR అధికారులు. పీవీ ఎలివేటెడ్‌ ఎక్స్‌ ప్రెస్‌ వే తరహాలో మెట్రో పిల్లర్లు సైతం నగరవాసులకు ల్యాండ్‌ మార్క్‌ గుర్తులుగా మారనుండటం విశేషం.

Posted in Uncategorized

Latest Updates