గూడ్స్‌ వ్యాగన్‌ దారితప్పింది…మూడున్నరేళ్లకు తిరిగొచ్చింది

మనిషి దారి తప్పిండు …అంటే అది సాధారణమే…కానీ రైలు గూడ్స్ వ్యాగన్ దారి తప్పింది…ఏదైనా రైలు దారి తప్పితే.. రైల్వే సిబ్బంది కాసేపటికి గమనించి దాన్ని గమ్యస్థానానికి చేరుస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆ గూడ్స్‌ వ్యాగన్‌ 1400 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి మూడున్నరేళ్లు పట్టింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతుంది.

2014 నవంబరులో విశాఖపట్టణానికి చెందిన ఇండియన్‌ పొటాష్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు ఎరువును పంపించేందుకు గూడ్స్‌ రైలులో ఓ వ్యాగన్‌ను బుక్‌ చేసింది. 1,400 కిలోమీటర్లు ప్రయాణించి ఆ గూడ్సు రైలు గమ్యస్థానానికి తిరిగి రావాలి. కానీ ఎరువులు నింపిన వ్యాగన్‌ గమ్యస్థానానికి చేరుకోవడానికి దాదాపు మూడున్నరేళ్లు పట్టింది. అందులో ఉన్న దాదాపు రూ.10లక్షల విలువైన ఎరువు పూర్తిగా పాడైపోయింది. ఎరువు పంపించిన వ్యాగన్‌ గమ్యస్థానానికి చేరలేదని గతంలో పలుమార్లు సదరు కంపెనీ యజమాని రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ ఎరువులు ఉన్న వ్యాగన్‌ బస్తీ రైల్వే స్టేషన్‌కు చేరింది. అయితే ఆ పాడైపోయిన ఎరువును తీసుకునేందుకు యజమాని రామచంద్ర గుప్తా నిరాకరించాడు. ఈ వ్యాగన్‌ను రైల్వే సిబ్బంది గూడ్స్‌ నుంచి వేరు చేసి వేరే రైల్వే స్టేషన్‌లో ఉంచడం వల్ల ఇది గమ్యస్థానానికి చేరుకోలేకపోయింది. ఇన్నాళ్లుకు గమనించిన సిబ్బంది దానిని గమ్యస్థానానికి చేర్చారు. రూ.10లక్షల విలువైన ఎరువు పూర్తిగా పనికి రాకుండా పోవడం వల్ల తనకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు రామచంద్ర గుప్తా. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కూడా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు.

Posted in Uncategorized

Latest Updates