గెలుపే టార్గెట్ : ఈడెన్ లో కీలక మ్యాచ్ కు రెడీ అయిన కోల్ కతా-ఢిల్లీ

KKRఈడెన్ గార్డెన్స్ లో కాసేపట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో కీలక మ్యాచ్ కు రెడీ అయ్యింది కోల్ కతా నైట్ రైడర్స్. IPL లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో చెరో రెండూ ఓడిన ఈ జట్లు ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో అడుగు ముందుకేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఢిల్లీపై మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉన్న కోల్ కతా ఫేవరెట్ గా బరిలోకి దిగబోతోంది.
అద్భుత ప్లేయర్లు ఉన్నా కూడా ప్రస్తుత IPL లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్. కాసేపట్లో ఈ రెండు జట్లూ కీలక మ్యాచ్ ఆడబోతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయినా అంతకు ముందు మొదటి మ్యాచ్ లో బలమైన బెంగళూరు జట్టును ఓడించిన అనుభవం కోల్ కతా జట్టుకు ఉంది. సొంత మైదానంలో ఆడుతున్న బలానికి తోడు బెంగళూరుపై గెలిచిన వ్యూహాన్నేఢిల్లీపైనా అమలు చేసేందుకూ కోల్ కతా సిద్ధమైంది.
ఢిల్లీ డేర్ డెవిల్స్ విషయానికి వస్తే.. మొదటి రెండు మ్యాచ్ లూ ఓడిపోయి మూడో మ్యాచ్ లో ముంబైని మట్టి కరిపించిన జోష్ కనిపిస్తోంది. ఆ జట్టు కూడా ఆడిన మూడు ఆటల్లో.. ఒకటే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. రికార్డు మెరుగుపరుచుకోవాలంటే ఢిల్లీకి కోల్ కతాపై విజయం కీలకం కానుంది. ముంబైతో ఆటలో చివరి వరకూ ఒత్తిడిని తట్టుకుని లాస్ట్ బాల్ కు మ్యాచ్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ అదే వ్యూహాన్ని, అదే ఉత్సాహాన్ని కోల్ కతాపై కూడా చూపించేందుకు ప్లాన్ చేస్తోంది.
కోల్ కతా జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఢిల్లీ జట్టులో మాత్రం ఒక మార్పు చేసే చాన్స్ ఉంది. గాయం నుంచి కోలుకున్న క్రిస్ మోరిస్.. మ్యాచ్ కు ముందు పూర్తి ఫిట్ గా ఉంటే తుది జట్టుకు ఎంపికవ్వొచ్చు. కానీ ముంబైపై గెలిచిన జట్టునే ఈడెన్ గార్డెన్స్ లో కూడా దింపాలనుకుంటే ఆ మార్పు కూడా లేకుండానే ఢిల్లీ జట్టు కోల్ కతాను ఫేస్ చేసే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates