గోడను ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం…ప్రయాణికులు సేఫ్

తమిళనాడులోని తిరుచి నుంచి దుబాయ్‌ బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం వేకువజామున 1:29గంటల సమయంలో తిరుచి ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్‌ అవుతుండగా.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) ప్రహరీ గోడను ఢీకొట్టి వెళ్లిపోయింది. విమానం రెండు చక్రాలు ఏటీసీ ప్రహరీ గోడను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాయి. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని ముంబయికి దారిమళ్లించారు. ముంబయి ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో 136 మంది ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో విమానం చక్రాలు, యాంటినా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.

కాగా.. గోడకు ఢీకొట్టిన తర్వాత కొంతసేపు విమానానికి ఏటీసీ సిగ్నల్స్‌తో సంబంధాలు తెగిపోయాయని, ఆ తర్వాత కొన్ని గంటలకు ముంబయిలో విమానం ల్యాండ్‌ అయ్యిందని అధికారులు తెలిపారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగిందా.. లేదా పైలట్ల తప్పిదమా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులను మరో విమానంలో దుబాయ్‌ తరలించినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. అటు డీజీసీఏ కూడా ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates