గోదావరిలో ఘోర ప్రమాదం : పడవ బోల్తా పడి 10 మంది గల్లంతు

ఏపీ రాష్ట్రంలో మరో ఘోర విషాదం. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో జూలై 14వ తేదీ శనివారం మధ్యాహ్నం పడవ బోల్తా పడింది. ఓ పడవ పలాసతిప్ప నుంచి పశువుల్లంక గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో స్థాయికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం వల్లే బోల్తా పడినట్లు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పడవలో 30 మంది ఉన్నట్లు చెబుతున్నారు. పడవ బోల్తా పడిన విషయాన్ని ఒడ్డు నుంచి గమనించిన పశువుల్లంక గ్రామస్తులు వెంటనే మరికొన్ని పడవలతో స్పాట్ కు వెళ్లారు. 10 మందిని నదిలో నుంచి ఒడ్డుకి తీసుకొచ్చారు. మరో 10 మంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. మిగిలిన 10 మంది గల్లంతు అయినట్లు చెబుతున్నారు ఒడ్డుకి వచ్చిన ప్రయాణికులు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు గాలింపులో దొరికాయి. గల్లంతు అయిన 10 మంది విద్యార్థులే. వీళ్లందరూ పదో తరగతి చదువుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. రెండు, మూడు రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఉధృతంగా ప్రవహిస్తోంది నది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు పడవల్లో గాలింపు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates