గోల్డెన్ బాబా బ్యాక్ : ఒంటిపై 20 కేజీల బంగారంతో యాత్ర


ఈయన ఓ బాబా.. ఆధ్యాత్మికత ప్రబోధించటం ఈయన ధర్మం. లోక కల్యాణం కోసం తెగ తిరిగేస్తూ ఉంటారు. ఈయన ఆశీర్వాదం ఉంటే కష్టాలు ఇట్టే మాయం అయ్యి.. సుఖాలు, డబ్బు దండిగా వస్తాయనేది ప్రచారం ఉంది. తన ఒంటిపై 20 కేజీల బంగారు ఆభరణాలతో ఈసారి యాత్ర చేపట్టారు. అంతా హైటెక్ హంగులు. పొలిటికల్ లీడర్ కూడా ఇంత బిల్డప్ తో యాత్ర చేసి ఉండరంటే ఆశ్చర్యం. ఈ బాబా పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈయన పేరు మక్కర్. హరిద్వార్ నివాసం. ప్రస్తుతం ఈయన కన్వర్ యాత్రలో పాల్గొంటున్నారు. హరిద్వార్ నుంచి ఢిల్లీకి 200 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు. యాత్ర కామన్ అయినా.. మక్కర్ అలియాస్ గోల్డెన్ బాబా తీరు మాత్రం చర్చనీయాంశం అయ్యింది. ఆయన ఈసారి తన ఒంటిపై 20 కేజీల బంగారు ఆభరణాలతో దర్శనం ఇచ్చారు. వీటిలో 21 గొలుసులు, 21 లాకెట్లు ఉన్నాయి. బంగారు జాకెట్ కూడా ధరించారు. ఇందులో శివుడి లాకెట్ తో ఉన్న గొలుసు బరువే 2 కేజీలు ఉంది. అదే విధంగా 27 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ కూడా చేతికి పెట్టాడు. ఆయన ధరించిన ఆభరణాల విలువ అక్షరాల 6 కోట్ల రూపాయలు. దీంతో ఈ బాబాకి సీఐ ర్యాంక్ ఆఫీసర్ తోపాటు ఐదుగురు కానిస్టేబుళ్లు రక్షణగా నిలుస్తున్నారు. నిరంతరం ఆయన్ను కాపాడుతూ ఉంటారు.

ఇక యాత్ర జరిగే విధానం చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. గోల్డెన్ బాబా యాత్రలోని అన్నీ కార్లు కాస్ట్లీనే. BMW కారులో ప్రయాణిస్తారు. కాన్వాయ్ లోనూ రెండు ఫార్చ్యునర్ కార్లు, రెండు ఆడి కార్లు, రెండు ఇన్నోవా కార్లు ఉన్నాయి. ఇవన్నీ సొంత వాహనాలు. వీటికితోడు హమ్మర్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్లను అద్దెకు తీసుకున్నారు. ఇంత భారీ హంగామాతో చేపట్టిన మాక్కర్ అలియాస్ గోల్డెన్ బాబా 25వ కన్నర్ యాత్రలో యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనటం విశేషం. ఆయన ఆశీర్వాదం కోసం ప్రజలు ఎగబడుతున్నారు. మరో విశేషం కూడా ఉందండీ.. ఈ మక్కర్ బాబాకి ఘజియాబాద్ ఇందిరాపురంలో విలాసవంతమైన విల్లాలు ఉన్నాయి.

ఇంత సంపాదించాడు.. ఏం చేస్తుంటాడు అనే డౌట్ వస్తుంది కదా.. బాబాకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. బిట్టూ బ్రాండ్ పేరుతో జీన్స్ ప్యాంట్స్, చొక్కాలు తయారు చేస్తుంటారు. అదే విధంగా ఆలయాల దగ్గర విక్రయించే పూసల దండలు, పంచెలు, పూజా సామాగ్రి బిజినెస్ ఉంది. ఇదంతా ఏం చేస్తావయ్యా అంటే.. చనిపోయిన తర్వాత నా శిష్యులకు చెందే విధంగా ముందుగానే వీలు రాసి పెట్టాను అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates