గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు : బీమా సదుపాయం ఉన్నట్లే తెలియదు

gas cylindar firing వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలుళ్లకు ప్రతియేటా రాష్ట్రంలో అనేక మంది చనిపోతున్నారు. సిలిండర్ల పేలుళ్ల వల్ల భారీగా ఆస్తినష్టం సంభవిస్తున్నా బాధిత కుటుంబాలు చట్ట ప్రకారం పొందాల్సిన బీమా పరిహారానికి నోచుకోవడంలేదు. ప్రమాదాలకు గురయ్యే ఎల్పీజీ వినియోగదారులకు తప్పనిసరిగా చెల్లించాల్సిన బీమా పరిహారాన్ని అందించడంలో ప్రభుత్వరంగ చమురు సంస్థలు సైతం విఫలమవుతున్నాయి.

ఎల్పీజీ వినియోగదారుల్లో అత్యధిక శాతం మందికి బీమా సదుపాయం ఉందన్న సంగతే తెలియదు. గత పదేళ్లలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుళ్ల కారణంగా తెలంగాణలో 657 మంది మృతిచెందగా కేవలం 25 మందికే బీమా పరిహారం అందింది. ఈ ఘటనల్లో రమారమి 3000 మంది క్షతగాత్రులయితే ఏ ఒక్కరికీ కూడా నష్ట పరిహారం లభించలేదు. అలాగే ఈ ప్రమాదాల్లో 1200లకుపైగా ఇళ్లు ధ్వంసమైతే ఆస్తి నష్టం కింద బాధితులకు పైసా పరిహారం లభించలేదు.

ప్రభుత్వరంగ చమురు సంస్థలైన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లు తమ పబ్లిక్‌ లయబిలిటీ పాలసీని అనుసరించి (పాలసీ నంబర్‌ 021700/ 46/14/37/0000041) ఒక్కో వ్యక్తి మరణానికి రూ. 5 లక్షల చొప్పున, ఒక్కో క్షతగాత్రుడికి గరిష్టంగా రూ. లక్ష చొప్పున, ప్రమాదం మొత్తంమీద గరిష్టంగా రూ. 15 లక్షలను వైద్య ఖర్చుల కింద బీమా పరిహారంగా చెల్లించాల్సి ఉంది. అలాగే ఆస్తి నష్టానికి గరిష్టంగా రూ. లక్ష పరిహారం అందించాల్సి ఉంది. అయితే ఈ పాలసీ ఉన్నట్లు డీలర్లకు వివరించడంలో చమురు సంస్థలు పూర్తిక విఫలమవుతున్నాయి. అలాగే ఈ పాలసీ గురించి అవగాహన ఉన్న డీలర్లు సైతం తమకేమి పట్టనట్లు వ్యవహారించడం వారి నిర్లక్ష్యం స్పష్టమవుతుంది. ఏదిఏమైనా ఘోరంగా నష్టపోయేది వినియోగదారులే.

Posted in Uncategorized

Latest Updates