దటీజ్ ఇండియా.. ఓ ముస్లిం కోసం హిందువులంతా కదిలొచ్చారు

జమ్ముకశ్మీర్: మనిషికి మతంతో సంబంధంలేదు.. మానవత్వమే మిన్నా అని చెప్పడానికి ఈ ఊరే ఉదాహరణ. ఒక్క ముస్లిం వ్యక్తి కోసం ఊరిలో ఉన్న హిందువులంతా కదిలివచ్చారు. అతడి మంచి మనసుకు సర్పంచ్ ని చేశారు.  ఈ సంఘటన డిసెంబర్ -7న మ్ముకశ్మీర్ లో జరుగగా.. సోషల్ మీడియాలో పలువురు మతసామరస్యాన్ని చాటారంటూ కితాబిస్తున్నారు.

వివరాల్లోకెళితే… జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భదేర్వా ప్రాంతంలోని భేలన్‌-ఖరోఠి గ్రామంలో 54ఏళ్ల చౌదరీ మహ్మద్‌ హుస్సేన్‌ ను గ్రామస్థులు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 450 కుటుంబాలున్న భేలన్‌-ఖరోఠి గ్రామంలో హుస్సేన్‌ ది ఏకైక ముస్లిం కుటుంబం. ఈయనకు నలుగురు కుమార్తెలు, ఐదుగురు కుమారులున్నారు.

స్థానికులతో ఎంతో సన్నిహితంగా మెలిగే హుస్సేన్‌ గ్రామపెద్దగా ఉంటే బాగుంటుందని భావించిన గ్రామస్థులు ప్రస్తుత ఎన్నికల్లో ఆయనను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సోదరభావానికి ప్రతీకగా నిలిచారు. తనను సర్పంచిగా ఎన్నుకోవడంపై హుస్సేన్‌ ఆనందం వ్యక్తం చేశారు. “ఈ గ్రామంలో మేం ఒంటరి అనే భావన ఎప్పుడూ రాలేదు. గ్రామస్థులంతా సోదరుల్లా మెలుగుతాం. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. ఈ జీవితాంతం వారికి రుణపడి ఉంటా. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతా” అని తెలిపాడు హుస్సేన్‌.

 

 

Posted in Uncategorized

Latest Updates