గ్రీస్ అడవుల్లో మంటలు : ఊరంతా తగలబడింది

గ్రీస్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం. ఏథెన్స్ నగరానికి 25 మైళ్ల దూరంలోని మాటి పర్యాటక బీచ్ ఏరియా సమీపంలోని అడవిలో మంటలు చెలరేగాయి. ఇవి నిమిషాల్లోనే దగ్గరలోని బీచ్ ప్రాంతంలోని విల్లాలు, పర్యాటక ప్రాంతానికి విస్తరించాయి. మంటలు థాటికి ఈ ఊరంతా తగలబడిపోయింది. కాలి బూడిద అయ్యింది. ఇంతా గంటల్లోనే పూర్తయ్యింది. ఈ అగ్నిప్రమాదంలో 50 మంది చనిపోయారు. మరో 200 మంది గాయపడ్డారు. చనిపోయిన వారి మృతదేహాలను కనీసం గుర్తించటానికి కూడా వీలులేకుండా ఉంది. గ్రీస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. సహాయ చర్యలకు సైన్యాన్ని రంగంలోకి దించింది. ప్రజలు అంతా మంటల నుంచి తప్పించుకోవటానికి సముద్ర తీరానికి చేరారు. 40 డిగ్రీల వేడి వస్తుండటంతో.. సముద్రం నీళ్లలో దిగి ప్రాణాలను కాపాడుకుంటున్నారు.

ఓ విల్లాలో 26 మృతదేహాలను గుర్తించారు. వీరంతా మంటల్లో కాలిపోయారు. ఇతర ఇళ్లల్లో మరో 24 మంది మృతదేహాలను గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు. అడవిలో మొదలైన మంటలకు ఈదురుగాలులు తోడవ్వటంతో మంటలు 15 నిమిషాల్లోనే మాటి ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇక్కడ ఇళ్లు అన్నీ కూడా చెక్కతో నిర్మాణం జరిగి ఉండటంతో.. మంటలను అదుపు చేయటం ఎవరి వల్లా కాలేదు. సైనిక నౌకలు, విమానాలు, ప్రైవేట్ హెలికాఫ్టర్లు బాధితులను తరలిస్తున్నాయి. సమీపంలోని ప్లోటిల్లాను రైఫినాలోని నేవీ బేస్ నుంచి పెద్ద సంఖ్యలో సైన్యం తరలివచ్చింది.

మాటిలోని ఇళ్లు, కార్లలో చాలా మంది చనిపోయి ఉన్నారని ప్రభుత్వ ప్రతినిధి డిమిట్రిస్ టజానాపౌపోస్ ప్రకటించారు. 11 మంది ప్రాణాలతో పోరాడుతున్నారని.. వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. మాటి ఇప్పుడు శ్మశాసాన్ని తలపిస్తోంది.. కాలిపోయిన ఇల్లు, వాహనాలు, సర్వం కోల్పోయి రోడ్డుపై ఉన్న బాధితులు, ఆర్తనాదాలు ఇలా బీభత్సంగా మారింది. ఈ మంటలపై అనుమానాలు ఉన్నాయని కూడా ప్రకటించింది ప్రభుత్వం. మాటిలో దోపిడీ కోసం అడవికి నిప్పు కూడా పెట్టి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనిపై విచారణకు ఆదేశించింది.

 

 

Posted in Uncategorized

Latest Updates