ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు….భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం(జూలై-27) ఉదయం నుంచే బాబా ఆలయాలకు భక్తులకు క్యూ కట్టారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. అటు వ్యాసబాగవానుడి ఆలయాల్లోనూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కొన్ని పాఠశాలల్లో గురుపూజోత్సవం నిర్వహించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే బాబా ఆలయాలకు క్యూ  కట్టారు భక్తులు. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లిలోని షిర్డీ సాయి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు.

మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాస పౌర్ణమి సందర్భంగా బాసరలో నిర్వహిస్తున్న ఉత్సవాల ముంగిపు కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మహాపూర్ణాహుతిలో పాల్గొని…ప్రత్యేక పూజలు చేశారు.

గురుపౌర్ణమి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలన్నీ సందడిగా మారాయి. షిర్డీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. వ్యాసమహర్షి పుట్టిన రోజు సందర్భంగా పలు స్కూళ్లలోనూ గురు పూజోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. గురువుకు ప్రతిరూపమైన సాయిబాబాను దర్శించుకుంటే విద్య, సంపదలు సిద్ధిస్తాయన్నారు పండితులు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే సాయి దర్శనానికి బారులు తీరారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కేతుగ్రహ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 2 గంటలకే ఆలయాలు మూసివేస్తారన్న సమాచారంతో ముందుగానే ఆలయాలకు చేరుకున్నారు.

గురుపూర్ణిమ సందర్భంగా ఖమ్మం జిల్లాలోని సాయిబాబా ఆలయాలు అందంగా ముస్తాబైయ్యాయి. బాబా సమాధి శతాబ్ధి ఉత్సవాల్లో ప్రత్యేకమైన రోజు కావటంతో… విద్యుత్ దీపాలతో ఆలయాలను అలంకరించారు. ఖమ్మంలోని గాంధీచౌక్, మామిళ్లగూడెం, వీడీఓ కాలనీ, బ్రాహ్మణ బజార్ ప్రాంతాల్లోని బాబా ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. నగరంలోని బాబా ఆలయంలో జరిగిన పూజల్లో ఎమ్మెల్యే అజయ్ కుమార్ దంపతులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ గ్రామంలో శ్రీ సద్గురు సాయిబాబా మందిరాన్ని పువ్వులు, మామిడి తోరణాలతో తీర్చిదిద్దారు. ఉదయం నుంచే స్వామివారిని దర్శించు కునేందుకు భక్తులు క్యూ కట్టారు. ప్రత్యేకమైన రోజు కావటంతో… భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. మధ్యాహ్నం మహా అన్నదానం నిర్వహించారు.

Posted in Uncategorized

Latest Updates