ఘన స్వాగతం : కామన్ వెల్త్ గేమ్స్ లో రికార్డులతో ముగిసిన భారత్ ప్రయాణం

GOLDగోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో పతకాల ప్రయాణాన్ని భారత్ ఘనంగా ముగించింది. భారత్ ఖాతాలో మొత్తం 66 మెడల్స్ చేరాయి. ఇందులో 26 గోల్డ్… 20 సిల్వర్… 20 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఇవాళ చివరిరోజు భారత్ ఒక గోల్డ్ మెడల్ సహా మొత్తం ఏడు పతకాలు సాధించింది. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది ఇండియా.
ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తన అత్యుత్తమ మూడో ప్రదర్శనను నమోదుచేసింది. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ మొత్తం 101 మెడల్స్ గెల్చుకుంది. మాంచెస్టర్ లో 2002లో 69 మెడల్స్ తన ఖాతాలో వేసుకుంది. 2014లో స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరంలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ 64 పతకాలు సొంతం చేసుకుంది. గోల్డ్ కోస్ట్ లో ఈ రికార్డును అధిగమించి మొత్తం 66 పతకాలు గెల్చుకుంది ఇండియన్ టీమ్.
పతకాలు గెల్చుకున్న ప్లేయర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా క్రీడా ప్రముఖులు విజేతలకు అభినందనలు తెలిపారు. దేశానికి గర్వకారణంగా నిలిచారని… తాము పెట్టుకున్న నమ్మకాన్ని ఆటగాళ్లు వమ్మచేయలేదని అన్నారు. బంగారు, వెండి, కాంస్య పతకాలు తెచ్చిన క్రీడాకారులు, వాటికోసం ప్రయత్నం చేసిన ఆటగాళ్లు ఈ దేశ యువతలో ఎంతో స్ఫూర్తి నింపారని చెప్పారు.
పతకాలు గెల్చుకుని వచ్చిన ప్లేయర్లకు స్వరాష్ట్రంలో ఘన స్వాగతం లభిస్తోంది. 50 మీటర్ల.. రైఫిల్ విభాగంలో.. గోల్డ్ మెడల్ సాధించిన తేజస్విని సావంత్ పుణె నగరం చేరుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఘన స్వాగత ఏర్పాట్లు చేసింది. స్వాగత ర్యాలీలో పెద్దసంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణంగా ఉందని తేజస్విని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates