ఘోరం.. రిఫ్రిజిరేటర్ సిలిండర్‌ పేలి బీటెక్ విద్యార్థిని మృతి

వంటింట్లో ఫ్రిజ్(రిఫ్రిజిరేటర్) గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు రావడంతో… ఓ బీటెక్ స్టూడెంట్ సజీవ దహనమైంది. ఈ దారుణమైన సంఘటన… హైదరాబాద్ శివారు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగుళూరు గ్రామం..  మైహోమ్స్ కాలనీలోని ఓ ఇంట్లో జరిగింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కొంపల్లి మనోహర్‌, లావణ్య దంపతులు ఐదేళ్లుగా బొంగుళూరు గ్రామ పంచాయతీ మై హోమ్స్‌ కాలనీలో ఉంటున్నారు. మనోహర్‌ టీవీ రిపేరర్. లావణ్య టైలర్‌. వీరి కూతురు 17 ఏళ్ల దీపిక… బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. పరీక్షల టైమ్ కావడంతో.. నిన్న గురువారం ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. తల్లిదండ్రులు డ్యూటీలకు.. చెల్లె స్కూలుకు వెళ్లిన టైమ్ లో ఇంట్లో ప్రమాదం జరిగింది.

ఫ్రిజ్ లోని ఆహార పదార్థాలను తీసేందుకు దీపిక వంటింట్లోకి వెళ్లింది. రిఫ్రిజిరేటర్ తలుపు తీస్తుండగానే… విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి.. ఫ్రిజ్ సిలిండర్‌ పేలిపోయింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఆ మంటల తీవ్రతకు, గాయాలకు తట్టుకోలేక అక్కడికక్కడే దీపిక చనిపోయింది. పేలుడు ధాటికి ఫ్రిజ్‌ తలుపు ఊడి దూరంగా పడింది. మంటలకు వంటింట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. పెద్ద శబ్దం, మంటలు రావడంతో పక్కనున్నవాళ్లు.. ఫైర్ డిపార్టుమెంట్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అగ్నిమాపక అధికారి కుమార్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని విద్యుత్‌ సరఫరాని నిలిపివేసి మంటలు చల్లార్చారు. దారుణ ప్రమాదంలో.. కూతురు చనిపోయిందన్న సంగతి తెలియడంతో.. ఆ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. కొద్ది రోజుల నుంచి ఫ్రిజ్‌ను తాకితే షాక్‌ కొట్టేదని… ఇవాళ ఇలా జరిగిందని కుటుంబీకులు చెప్పారు. ఫ్రీజర్ షాక్ కొట్టినప్పుడు ఆఫ్ చేసి పక్కన పెట్టి రిపేర్ చేయించాలని పోలీసులు జాగ్రత్తలు చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates