చంద్రగ్రహణం : శ్రీవారి దర్శన షెడ్యూల్

జూలై 27వ తేదీ అర్థరాత్రి చంద్రగ్రహణం ఏర్పడనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు ఆలయాలను మూసివేయనున్నారు. గ్రహణం సమయానికి తిరుమల ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపారు TTD  జేఈవో శ్రీనివాసరాజు.  శుక్రవారం (జూలై-27) రాత్రి 11.54కు చంద్రగ్రహణం ప్రారంభమై శనివారం ఉదయం 3.49 వరకు ఉంటుందన్నారు. గ్రహణం సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ అని చెప్పారు.

శనివారం (జూలై-28) ఉదయం 4.15కు సుప్రభాతంలో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసి పుణ్యహవచనం నిర్వహిస్తామని చెప్పారు.  తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చనసేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

27న ఆర్జిత, గరుడ సేవలు రద్దు..
చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవనూ టీటీడీ రద్దు చేసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి తిరుమలలో అన్నప్రసాద వితరణ నిలిపివేస్తున్నారు. తిరిగి శనివారం ఉదయం 9గంటల నుంచి అన్నప్రసాదాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదాల విభాగం ఆధ్వర్యంలో 20వేల పులిహోర, టమోటా అన్నం ప్యాకెట్లను సాయంత్రం 3 నుంచి 5  వరకు పంపిణీ చేయనున్నారు. తిరుమలలోని ఐదు అన్నప్రసాదాల వితరణ కేంద్రాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, నాదనీరాజన వేదిక ప్రాంగణంలో అన్నదానం నిర్వహిస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates