‘చంద్రబాబు డబ్బుతో ఆస్తులు కొన్నా’ : గన్నవరంలో శివాజీ రుసరుస

కృష్ణా: ఆపరేషన్ గరుడ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ లో హాట్ టాపిక్ అయిన నటుడు శివాజీ… కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రత్యక్షమయ్యారు. ఓ అపార్ట్‌మెంట్ లో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆయన వచ్చారు. గన్నవరం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ కు శివాజీ వచ్చారన్న సంగతి తెల్సుకున్న మీడియా సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వీడియోలు, ఫొటోలు తీయడంతో… శివాజీకి కోపం వచ్చింది. పత్రికా, మీడియా రిపోర్టర్లు, కెమెరామెన్, ఫొటోగ్రాఫర్లపై నోరు పారేసుకున్నారు. “ఫొటోలు, వీడియోలు తీస్తే మీ సంగతి చూస్తా” అంటూ హెచ్చరించారు. “రాస్తే రాసుకోండి. మహా అయితే ఏం రాస్తారు?  చంద్రబాబు ఇచ్చిన డబ్బుతో శివాజీ ఆస్తులు కొన్నారని రాస్తారు అంతేగా. రాసుకోండి” అంటూ రుసరుసలాడారు.

రిజిస్ట్రేషన్‌ను వేగంగా పూర్తి చేయించుకున్న శివాజీ… వెంటనే అక్కడినుంచి కారెక్కి వెళ్లిపోయారు. శివాజీ వెంట వచ్చిన వ్యక్తులు…  మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. ఫొటోలు తీసిన వారి ఫోన్లు లాక్కుని వాటి నుంచి ఫొటోలు, వీడియోలను డిలీట్ చేశారు. గన్నవరం దగ్గర్లోని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్‌ కంపెనీకి చెందిన అపార్టుమెంట్‌ లో రెండు ప్లాట్లను శివాజీ కొనుగోలు చేశారు.

Latest Updates