చంపుతానంటూ ప్రేయసికి బెదిరింపు : యువకుడి అరెస్ట్

హైదరాబాద్ : తనకు ఇష్టంలేదని చెప్పినా ప్రేమించాలంటూ యువకుడు వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ బాలిక. రంగారెడ్డి జిల్లా సరూర్‌ నగర్‌ మండలం శంకర్‌నగర్‌ కి చెందిన షేక్‌ ఖలీమ్‌ (20).. ఆటోనగర్‌ లో వెల్డింగ్‌ పనులు చేస్తుంటాడు. దిల్‌ సుఖ్‌ నగర్‌ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సరూర్‌ నగర్‌ కు చెందిన ఓ బాలిక(17)తో.. 2017 జూన్‌ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2018 ఆగస్టుతో బాలిక ఇంట్లో ఈ విషయం తెలిసింది. కుటుంబ సభ్యులు మందలించడంతో.. ఆమె ఖలీమ్‌ కు దూరంగా ఉంటోంది. అప్పట్నుంచీ తనతో మాట్లాడాలంటూ ఆ యువకుడు బాలికను వేధించాడు.

బాలిక కుటుంబ సభ్యులు ఖలీమ్‌ ను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా బాలిక వెంటపడుతున్నాడు. డిసెంబర్- 22న ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తుండగా.. దిల్‌ సుఖ్‌ నగర్‌ లో అడ్డుపడ్డాడు. తనతో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చాడు. రోడ్డుపై ఆమెను తిడుతూ… తనను కాదని వెరొకరిని పెళ్లి చేసుకుంటే చంపుతానని బెదిరించాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు మలక్ పేట పోలీసులు. కేసు నమోదు చేసుకున్నామని తెలిపిన పోలీసులు..ఖలీమ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపామని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates