చచ్చిపోతామంటే సరేనన్నారు..!

తమ సమస్యను పరిష్కరించాలని లేకపోతే చచ్చి పోతామని బాధిత రైతులు రెవెన్యూ అధికారులకు విన్నవిస్తే అదే ఫిర్యాదుపై ముద్ర వేసి ఇచ్చి విమర్శల పాలయ్యారు. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ మండల రెవెన్యూ అధికారుల నిర్వాకం పై బాధిత రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మి దేవునిపల్లి (కొండోన్ బావుల) గ్రామ సర్వే నం. 82 లో రైతు సుదర్శన్ కు 2 ఎకరాల 2 గుంటల భూమి ఉంది. అయితే రైతు బంధు చెక్కు మాత్రం 2 గుంటలకు రూ. 200 మాత్రమే వచ్చింది. మరో రైతు వెంకటయ్యకు  సర్వే నం.82, 83, 84 లో 10 ఎకరాల భూమి ఉంటే, 2 ఎకరాలకు మాత్రమే ఎంట్రీ చేశారు. కొత్త పట్టా పాసు పుస్తకాలు వచ్చి నా ఆన్ లైన్ లో ఎంట్రీ చేయకపోవడంతో పాటు పట్టాపాసు పుస్తకాలు వచ్చిన రైతులకు చెక్కులు రాలేదు.

చెక్కులు వచ్చినా వారికి పాసు పుస్తకాలు రాలేదు. ఇలా వచ్చిన వారికి ఆన్ లైన్ లో ఎంట్రీ చేయకపోవడంతో రైతులు కొన్నాళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.ఇందులో భాగంగా బుధవారం మహిళా రైతు సుశీల, మరి కొందరు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మా భూముల సమస్యలు పరిష్కరిస్తారా లేదా పురుగుల మందు తాగి చావమంటారా అని అధికారులకు ఫిర్యాదు చేస్తే చావండి అంటూ ఏకంగా ఫిర్యాదుపై తహసీల్దార్ కార్యాలయం ముద్ర వేసి ఇచ్చారని తెలిపింది. అధికారులు ముద్రవేసిన ఇచ్చి న దరఖాస్తు చూపించి అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Updates