చరిత్రకి సాక్ష్యం : గోల్కొండ కోటకి 500 ఏళ్లు

గొల్ల కొండ నుంచి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికర కథనం ఉంది. ఆ కథను బట్టి చూస్తే గోల్కొండ చరిత్ర వందల సంవత్సరాలనాటిది. అదేమిటంటే 1143లో మంగళవరం అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయ కమ్మరాజులకు  చేరింది. వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. కాకతీయ కమ్మరాజులకు, వారి వారసులు ముసునూరి కమ్మరాజులకు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యంలో ముఖ్యమైన కోట. గోల్కొండ కోట తొలుతగా 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయ్యింది. 1347లో బహమనీ సుల్తానులు ఈ కోటను ఆక్రమించుకున్నారు. గోల్కొండ కోటకు అజీమ్ హుమయూన్ ను అధిపతిగా చేసి బహమనీ సుల్తారులు గుల్బర్గాకు వెళ్లిపోయారు.

1525లో గోల్కొండ కోట నిర్మాణం

1507 నుంచి 62 సంవత్సరాలు గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్తులు నల్లరాతి కోటగా తయారు చేశారు. 500 ఏళ్ళ ఘనమైన చరిత్ర కలిగిన ఈ గోల్కొండ కోట 1525 లో ఖులి ఖుతుబ్ షా నిర్మించారు. కోట బురుజులతో సహా ఇది 5 కి.మీ. చుట్టుకొలత ఉంది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన 1687లో  ఔరంగజేబు విజయంతో అంతం అయ్యింది. ఆ సమయంలో ఔరంగజేబు కోటను నాశనం చేశాడు.

వజ్రాలకు ప్రసిద్ధి గోల్కొండ

గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచ ప్రసిద్దమైన కోహినూరు వజ్రం, పిట్ వజ్రం, హోప్ వజ్రం, ఓర్లాఫ్ వజ్రం ఈ రాజ్యములోని పరిటాల-కొల్లూరు గనుల నుంచి వచ్చాయి. గోల్కొండ గనుల నుంచి వచ్చిన ధనము, వజ్రాలు నిజాం చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తుల నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ 1724 నుంచి 1948లో భారత్‌లో విలీనమయ్యే వరకు పరిపాలించారు.

నాలుగు కోటల సముదాయం

గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం. కోటను విస్తరించటంలో కుతుబ్‌షాహిలు కీలక పాత్ర పోషించారు. మొదటి నిజాం వశమైన కాలంలో కోట వెలుపల.. తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దానిని శత్రువు ఆక్రమిస్తే కష్టమని భావించిన నిజాం.. గుట్టను కోటలోపలికి కలుపుతూ చుట్టూ గోడను నిర్మించాడు. ఈ కోట 87 అర్ధ చంద్రాకారపు బురుజులతో 10 కిలోమీటర్ల పొడవు గోడ నిర్మించారు. కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను అమర్చారు. 8 సింహ ద్వారాలు,  నాలుగు ఎత్తయిన వంతెనలు (draw bridge), రాచ మందిరాలు, మసీదులు, గుళ్ళు, గుర్రపు శాలలు కోట ఆవరణలో, చుట్టూ ఏర్పాటు చేశారు.

సింహ ద్వారంలో అన్నిటి కంటే కింద ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుంచే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాం. ఔరంగజేబు విజయం తర్వాత ఈ దారి నుంచే సైన్యం రాకపోకలు సాగించేది. ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికి ఆగ్నేయము వైపు పెద్ద ఇనుప చువ్వలు ఏర్పాటు చేశారు. కింద ద్వారం కింద ఒక నిర్ణీత ప్రదేశంలో చప్పట్లు కొడితే.. కిలోమీటర్ దూరంలో గోల్కొండ కోటలో ఎత్తయిన ప్రదేశంలో ఉన్న బాలా హిస్సారు దగ్గరకి స్పష్టంగా వినిపిస్తుంది. ఈ విశేషాన్ని ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాద సంకేతాలు తెలిపేందుకు ఉపయోగించేవారు. ఇప్పుడు సందర్శకులకు వినోదంగా మారింది.

ఆకట్టుకునే భవనాలు.. గొలుసుకట్టు చెరువులు

కోటలో మూడు అంతస్తుల్లో సభా మంటపం నిర్మించారు. ఇక్కడి నుంచి గోషామహల్‌ బారాదరి హైదరాబాద్ భూమార్గం కూడా ఉంది. దీనిపై అంతస్తులో రాజ సింహాసనం ఉంది. దీని నుంచి 30 మైళ్ళ విస్తీర్ణంలో అతి సుందర, శోభాయమానముగా కన్పిస్తుంది. దీని నుంచి తూర్పుగా కుతుబ్‌షా వంశపు శిథిలమైన భవనాలు, లంగర్‌హౌజ్‌ చెరువు, హైదరాబాద్‌ సిటీ కనిపిస్తోంది. చార్మినార్, మక్కా మసీదు, ఉస్మానియా ఆస్పత్రి కూడా కనిపిస్తాయి. తూర్పు-దక్షిణ దిశల్లో మీర్‌ ఆలమ్‌ చెరువు, ఫలక్‌నుమా ప్యాలెస్, దక్షిణంలో మకై దర్వాజా, హిమాయత్‌నగర్‌, దీనికి దక్షిణ పడమర దిక్కున తారామతి, ప్రేమామతి, ఉస్మాన్‌ సాగర్‌ చెరువు (గండిపేట) ఉన్నాయి. తూర్పు – ఉత్తర దిక్కులో హుస్సేన్ సాగర్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీని చూడొచ్చు. ఉత్తర-పడమర దిక్కులో కుతుబ్‌షా రాజుల గోపురాలు, పేట్లబురుజు కనిపిస్తాయి. ఉత్తర దిశలో గోల్కొండ కోట, హకీం పేట, బేగంపేట విమానాశ్రయాన్ని చూడొచ్చు.

కోటకు తొమ్మిది ద్వారాలు…87 బురుజులు

కోటకు మొత్తం తొమ్మిది (తలుపులు) ద్వారాలున్నాయి. ఫతే దర్వాజ, మోతి దర్వాజ, కొత్తకోట దర్వాజ, జమాలి దర్వాజ, బంజారి దర్వాజ, పటాంచెరు దర్వాజ, మక్కా దర్వాజ డబుల్‌, బొదిలి దర్వాజ, బహిమని దర్వాజా. వీటిలో 1,2,3,4,5,7 ప్రయాణీకుల సౌకర్యార్థము తెరచి వుంటాయి. మిగిలిన వాటిని మూసివేశారు. యుద్ధ సమయాల్లో శత్రువు గేటు ద్వారా ప్రవేశించే సమయంలో కాగుతున్న నూనెలు, ఇతర లోహాలను శత్రు సైన్యంపై పోసేవారు.

మొత్తం 87 బురుజులున్నాయి. వీటిలో పేట్లబురుజు, మూసా బురుజు, మజ్‌నూ బురుజు ఇప్పటికీ చెప్పుకోదగ్గవి. పేట్ల బురుజు కోటకు ఉత్తర పడమర దిక్కుగా ఉంటుంది. అలంగిరీ విజయానికి చిహ్నంగా.. ఫిరంగి ఏర్పాటు చేశారు. ఇది 16 అడుగులు పొడవు ఉంటుంది. కోటకు దక్షిణంగా మూసా బురుజు. 1666 సంవత్సరంలో కమాండర్‌ మూసా ఖాన్‌ ఆధిపత్యంలో ధర్మాచారి అనే మేస్త్రీ దీన్ని నిర్మించాడు. ఈ బురుజుపైనా ఫిరంగి ఉంటుంది.

తారామతి, ప్రేమామతి మందిరాలు

గోల్కొండ కోట బయట కూడా రెండు వేర్వేరు ఉంటాయి. ఒకటి తారామతి గానా మందిర్. మరొకటి ప్రేమామతి నృత్య మందిర్. తారామతి, ప్రేమమతి అనే అక్కా చెల్లెళ్ళు ఈ వృత్తాకార వేదికపై ప్రదర్శనలు ఇచ్చేవారు. గోల్కొండ కోటపై ఉన్న రాజదర్బార్ నుంచి ఈ కళా మందిర్ ని వీక్షించవచ్చు. ప్రపంచంలోనే అద్భుత నిర్మాణాల్లో 500 సంవత్సరాల తర్వాత కూడా గోల్కొండ కోట.. ఒకటిగా నిలిచింది. ఈ  కోటని సందర్శించడానికి దేశ విదేశాల నుంచి వేల మంది పర్యాటకులు వస్తుంటారు.

 

Posted in Uncategorized

Latest Updates