చరిత్రలో ఫస్ట్ టైం : 5 కాదు.. తొమ్మిది రోజులు శ్రీవారి దర్శనం నిలిపివేత

తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహా సంప్రోక్షణ సందర్భంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది పాలక మండలి. ముందుగా ఐదు రోజులు మాత్రమే అని సంకేతాలు ఇచ్చినా.. అత్యవసరంగా సమావేశం అయిన పాలక మండలి తొమ్మిది రోజులు శ్రీవారి దర్శనం సామాన్యులకు లేదని ప్రకటించి సంచలనం రేపింది. ఆగస్ట్ 9వ తేదీ నుంచే కొండపైకి భక్తులను అనుమతించరు. 2018 ఆగస్ట్ 9 నుంచి 17వ తేదీ వరకు ఈ నిబంధన అమల్లోకి ఉంటుందని తెలిపింది. ఆగస్ట్ 11వ తేదీన మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరుగుతుంది. 12 నుంచి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు.

ఆగమశాస్త్ర పండితుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలక మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. ఆగస్ట్ 9వ తేదీ ఉదయం నుంచి ఆగస్ట్ 17వ తేదీ సాయంత్రం వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేస్తారు. ఈ తొమ్మిది రోజులు కేవలం 30వేల మందికి మాత్రమే దర్శనం కల్పించనున్నారు. ఇది కూడా వీఐపీలకు మాత్రమే అవకాశం ఉండొచ్చు. సామాన్య భక్తులకు మాత్రం ఎంట్రీ ఉండదు.

తొమ్మిది రోజులు శ్రీవారి దర్శనం నిలిపివేయటం చరిత్రలో ఇదే అంటున్నారు కొంత మంది పండితులు. గతంలో నిర్వహించిన సంప్రోక్షణ సమయంలోనూ.. మూడు, నాలుగు గంటలు సామాన్యులకు దర్శనం కల్పించారని చెబుతున్నారు. అది కూడా ఐదు రోజులు మాత్రమే ఈ నియంత్రణ ఉండేదని వారి వాదన. ఇప్పుడే ఏకంగా తొమ్మిది రోజులు దర్శనం మొత్తం నిలిపివేయటం ఇదే మొదటిసారి అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates