చరిత్ర తిరగరాశాడు : 82 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ బౌలర్

అబుదాబి: క్రికెట్ లో రికార్డులు బ్రేక్ చేయడం కామన్. అయితే 82 ఏళ్ల రికార్డు అంటే మాటలా..అలాంటి చరిత్రను తిరగరాశాడు పాకిస్తాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ యాసిర్ షా.  అత్యంత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌ తో మూడో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ లో యాసిర్‌ షా ఈ ఘనతను సాధించాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు విలియమ్‌ సోమర్‌ విల్లేను ఔట్‌ చేయడంతో యాసిర్‌ షా రెండొందల వికెట్‌ ను ఖాతాలో వేసుకున్నాడు.

యాసిర్‌ షా 33వ టెస్టుల్లోనే రెండొందల వికెట్లు సాధించి, కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ క్రమంలోనే 82 ఏళ్ల రికార్డును యాసిర్‌ షా బద్ధలు కొట్టాడు. 1936లో ఆసీస్‌ లెగ్‌ స్పిన్నర్‌ క్లారీ గ్రిమ్మెట్‌ రెండొందల వికెట్‌ ను 36వ టెస్టులో సాధించాడు. ఇప్పటివరకూ ఇదే అత్యుత్తమం కాగా, దాన్ని యాసిర్‌ షా బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్‌ తో మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ లో మూడు వికెట్లు సాధించిన యాసిర్‌.. రెండో ఇన్నింగ్స్‌ లోనూ అదే తరహా ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. నాల్గో రోజు ఆటలో ఇప్పటివరకూ రెండు వికెట్లను తీశాడు.

 

Posted in Uncategorized

Latest Updates