చిత్తూరులో దారుణం: లోయలో పడ్డ లారీ..ఏడుగురి మృతి

acciచిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్దవంక అటవీ ప్రాంతం సమీపంలో శనివారం(జూన్-16) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడటంతో తమిళనాడుకు చెందిన ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు వేలూరు జిల్లా కల్లనరసంబట్టు గ్రామానికి చెందిన 31 మంది కూలీలు మామిడి కాయలు కోసేందుకు కుప్పం మండలం విజలా పురం గ్రామానికి వచ్చారు.

శనివారం(జూన్-16) ఉదయం నుంచి సాయంత్రం వరకూ మామిడి కాయలు కోసి లారీలోకి నింపి అదే వాహనంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఓ వైపు జోరు వర్షం.. చిమ్మచీకట్లోనే లారీ వేలూరుకు బయలు దేరింది. కుప్పం మండలం పెద్దవంక సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఘాట్‌ దగ్గర లారీ అదుపు తప్పి సుమారు 50 అడుగుల లోయలోకి బోల్తా కొట్టింది. మామిడికాయలతో పాటు కూలీలు లోయలోకి పడిపోయారు. ఈ ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి.. తమిళనాడు, ఏపీ పోలీసులకు సమాచారం అందించాడు.
ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, వైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ, మామిడికాయల కింద వున్న కూలీలను ఒక్కొక్కరిని వెలికి తీస్తున్నారు. అందులో ఏడుగురు మరణించినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. గాయపడిన వారిని తమిళనాడులోని వేలూరు, కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు కలెక్టర్‌ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలను పర్యవేక్షించారు.

 

Posted in Uncategorized

Latest Updates