చిత్రంగా.. వింతగా అనిపిస్తోంది : కరక్కాయల పేరుతో రూ.5 కోట్లు మోసం

టైటిల్ చూడగానే షాక్ అయ్యాం కదా.. ఇది పచ్చి నిజం. మీకు చిత్రంగా.. వింతగా అనిపించినా సరే.. ఇది మాత్రం పక్కా నిజం. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.. వందల మంది బాధితులు ఆందోళనకు కూడా దిగారు. ఏంటీ కరక్కాయల వ్యాపారం.. రూ.5 కోట్లు ఎలా మోసపోయారు అనేది తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పాల మల్లికార్జున అనే వ్యక్తి. పెయిన్ మిత్ర అండ్ సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూర్స్ లిమిటెడ్ పేరుతో.. ఆన్ లైన్ దుకాణం తెరిచాడు. తామిచ్చిన కరక్కాయల్ని  పొడిచేసి ఇస్తే వెయ్యికి.. మూడు వందలు  లాభం ఇస్తానని జనాన్ని నమ్మించాడు.

హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) రోడ్ నెంబర్ వన్ లో SIMT అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఓ ఆఫర్ ప్రకటించింది. కరక్కాయ పౌడర్ బిజినెస్. మందుల తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని చెబుతూ.. కిలో కరక్కాయలు కొనుగోలు చేసి తీసుకెళ్లండి. దాన్ని పౌడర్ చేసి తీసుకొస్తే రూ.1,300 ఇస్తాం. అంటే మూడు వందలు లాభం. దీంతో KPHB కాలనీలోని మహిళలే కాకుండా.. వారికి తెలిసినవారు, చుట్టుపక్కల కాలనీ వాసులు వందల మంది ఈ స్కీమ్ లో సభ్యులుగా చేరారు. ఒక్కొక్కరు 10వేలు, 20వేలు డిపాజిట్ కూడా చేశారు. అందర్నీ నమ్మించటం కోసం మొదట రెండు, మూడు కిలోల కరక్కాయలు ఇచ్చిన కంపెనీ.. వాటిని పౌడర్ గా మార్చి తీసుకొచ్చిన వారికి కిలోకి రూ.300 చొప్పున కమీషన్ కూడా ఇచ్చింది. దీంతో అందరూ నమ్మి విపరీతంగా రావటం మొదలుపెట్టారు. కరక్కాయ పౌడర్ అంటూ కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఇది రూ.5 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అయితే రెండు రోజులుగా కంపెనీ తెరుచుకోలేదు. ఫోన్లు పని చేయటం లేదు. దీంతో వందల మంది బాధిత మహిళలు KPHB పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.

వెయ్యికి రూ.300 కమీషన్ అనే సరికి ఒకరికి తెలియకుండా ఒకరు.. మహిళలు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. కరక్కాయలను పౌడర్ చేస్తే 300 రూపాయలు ఎందుకు ఇస్తున్నాడో మాత్రం ఆలోచించలేదు ఎవరూ. ఆ కరక్కాయలను కంపెనీనే పౌడర్ గా మార్చుకుంటే.. ఆ 300 రూపాయలు మిగులుతాయి కదా అనే పాయింట్ పై ఇంట్లో మగాళ్లు.. మోసపోయిన మహిళలకు క్లాసులు పీకుతున్నారు. వెయ్యికి 300 కమీషన్ అంటే ఎలా నమ్మారని కొందరు అంటుంటే.. కరక్కాయలు పౌడర్ చేయటానికి మాత్రమే 300 రూపాయలు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. కంప్లయింట్ తీసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates