చిన్నారి అసిఫా కేసు ఏంటీ : ఇలాంటి ఘోరాలకూ మద్దతు ఉంటుందా?

డ్ునదఎనిమిదేళ్ల చిన్నారి అసిఫా. ముక్కుపచ్చలారిని పాపాయి. కష్టం అంటే ఏంటో.. బాధలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోలేని వయస్సు. ఎవడు దొంగ.. ఎవడు మంచివాడో కూడా తెలుసుకోలేదు. ఇలాంటి చిన్నారిని కిడ్నాప్ చేసి.. అడవిలోకి తీసుకెళ్లి.. డ్రగ్స్ ఇచ్చి.. వారం రోజులు అత్యాచారం చేసి.. ఆ తర్వాత బండరాయితో కొట్టి మరీ చంపారు అంటే వాళ్లను మనుషులు అని ఎలా అందాం.. కచ్చితంగా అనలేం. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి రక్తాన్ని మరిగిస్తున్న ఈ ఘటన.. నాలుగు నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ ఎందుకు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది.. ఇందులో పాపం ఎవరిది.. అసలు ఘటన ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. ఎందుకు జరిగిందో పూర్తి కథనం చూద్దాం…

జమ్మూకాశ్మీర్ లోని కతువా జిల్లా రసన గ్రామంలో బకర్వాల్ ముస్లిం కుటుంబానికి చెందినది ఎనిమిదేళ్ల చిన్నారి అసిఫా. 2018, జనవరి 11వ తేదీన ఇంటి ఆవరణలోని గుర్రాలకు మేతవేస్తూ ఉంది. కొందరు దుండగులు ఆ చిన్నారిని ఎత్తుకెళ్లారు. ఆ వెంటనే తండ్రి పోలీసులకు కంప్లయింట్ చేశారు. అయినా ఆచూకీ దొరకలేదు. జనవరి 17వ తేదీన చిన్నారి ఆసిఫా.. కతువా జిల్లా పరిధిలోని అడవుల్లో శవమై కనిపించింది. ఒంటిపై దారుణమైన గాయాలు. ముఖం అంతా పీక్కపోయి ఉంది. అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన గుర్తులు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డ్రగ్స్ ఇచ్చి.. పలుమార్లు అత్యాచారం చేసి చంపినట్లు తేలింది. ఈ విషయంపై కతువా జిల్లాలోని బకర్వాల్ వర్గం ఒక్కసారిగా భగ్గుమన్నది. న్యాయం కోసం రోడ్డెక్కింది. అంతే జనవరి 18వ తేదీన పోలీసులు మేల్కొన్నారు. ఈ అత్యాచారం, హత్యకి 15 ఏళ్ల బాలుడు దీపు భయ్యా కారణం అని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీపు భయ్యా అనే బాలుడు అమాయకుడని, ఆ కుర్రోడికి సంబంధం లేదని స్థానికులు ఆందోళనకి దిగారు. ఇదంతా తెలియని దీపు.. పోలీస్ స్టేషన్ లో నేనే నేరం చేశానని ఒప్పుకున్నాడు. మూడు రోజుల తర్వాత అదే బాలుడు యూటర్న్ తీసుకున్నారు. పోలీసులు బలవంతంగా ఒప్పించారని.. అసిఫా కేసుతో సంబంధం లేదని చెప్పాడు. దీంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. కేసును రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆందోళనకు దిగారు.

అటు ముస్లిం వర్గాలకు – ఇటు బీజేపీ నేతల మధ్య గొడవగా మారటంతో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ.. జనవరి 23వ తేదీన కేసును క్రైం బ్రాంచ్ కు బదిలీ చేసింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన స్పెషల్ టీం.. 26వ తేదీన కాశ్మీర్ లో భద్రత నిర్వహించే ప్రత్యేక దళానికి చెందిన దీపక్ కజారియా, సురీందర్ వర్మ అనే ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసింది. ఇక్కడే కేసు ఊహించని మలుపు తిరిగింది. కేసులో భద్రతా దళాలకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఉన్నారన్న వార్త సంచలనం అయ్యింది. వీరు అగ్రవర్ణాలకు చెందిన అధికారులు కావటంతో బీజేపీ, RSS వారికి మద్దతుగా రంగంలోకి దిగాయి. క్రైం బ్రాంచ్ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని.. హిందూవులను టార్గెట్ చేస్తున్నారంటూ ఫిబ్రవరి 14 నుంచి 17వ తేదీ వరకు బీజేపీ – RSS సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ కేసు విచారణ అధికారుల తీరును ప్రశ్నించాయి. ఈ ఆందోళనలో కతువా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శితోపాటు, బీజేపీ – పీడీపీ భాగస్వామ్య ప్రభుత్వంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు సైతం పాల్గొన్నారు. క్రైం బ్రాంచ్ అరెస్ట్ చేసిన నిందితులకు మద్దతుగా భారీ ర్యాలీ తీయటమే కాకుండా.. భారతదేశానికి అనుకూలంగా, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయటం విశేషం.

బాధితురాలు అయిన అసిఫా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీ కతువా జిల్లా హీరానగర్ లో అగ్రవర్ణాలకు చెందిన కొందరు పెద్దలు సమావేశం అయ్యి బకర్వాల్ కుటుంబాలను బహిష్కరించారు. ఎవరూ పనులు కూడా ఇవ్వకూడదని నిర్ణయించారు. అప్పటి నుంచే కేసు నీరుగార్చేందుకు ప్రయత్నాలు సాగాయి. ఈ కేసు విషయంలో జమ్మూకాశ్మీర్ లో రాద్దాంతం జరుగుతున్నా.. కేసులోని చిక్కుముడులతోపాటు రాజకీయ జోక్యం, మత పరమైన అంశాలు, భద్రతా దళాల అధికారుల ప్రమేయం ఉండటంతో ముందుకు సాగలేదు. ఆ రాష్ట్రం దాటి.. జాతీయ స్థాయిలో పత్రికల్లో ఈ కథనాలు రావటంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫాను ఎంత క్రూరంగా అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేసింది పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయటంతో మరింత వెలుగులోకి వచ్చింది. రాజకీయ, మతపరమైన అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ ఓ చిన్నారిపై ఇంత క్రూరత్వంగా ప్రవర్తించిన విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. డ్రగ్స్ ఇచ్చి.. 8 సంవత్సరాల చిన్నారిపై.. 40 ఏళ్ల వయస్సులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసినోళ్లు మామూలు వ్యక్తులు కాదని.. వాళ్లను ఉరి తీయాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ సైతం డిమాండ్ చేశారు. ప్రజా, సామాజిక సంస్థలు ఆందోళనకు దిగాయి. మరి న్యాయం ఇప్పటికైనా బాధితుల పక్షం వస్తుందో లేదో చూడాలి…

Posted in Uncategorized

Latest Updates