చిన్నారి ఆసిఫా రేప్, మర్డర్ : స్పందించకపోతే మానవత్వం చచ్చిపోయినట్లే

meenaజమ్ముకశ్మీర్‌ లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారి అసిఫాను రేప్ చేసి హత్య చేసిన ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నారి హత్యకు నిరసనగా ప్రజలు ర్యాలీలు, ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా గురువారం(ఏప్రిల్-12) అర్ధరాత్రి శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ ఘటనపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫా విషయం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రివర్గ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని.. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించాలన్నారు. 12ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా POSCO యాక్ట్ లో సవరణలు తీసుకురావాలని కోరారు.

ఇది ఒక వేకప్ కాల్ అని, ఇప్పుడు కూడా స్పందించకుంటే మానవత్వం చచ్చిపోయినట్లేనని కేంద్ర మంత్రి మేనకాగాంధీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. కనీసం ఆహారం, మంచినీళ్లు కూడా ఇవ్వకుండా.. ఎనిమిది రోజులు అత్యాచారం చేశారు అంటే.. వాళ్లు అస్సలు మనుషులే కాదన్నారు. హత్య చేయటానికి ముందు కూడా అత్యాచారం చేశారంటే.. అలాంటి వాళ్లకి భూమ్మీద బతికే అర్హత లేదని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి మేనకా గాంధీ.

చిన్నారి అసిఫాపై అత్యాచారం, హత్యలో చార్జిషీట్ వేసిన పోలీసులు.. కఠోర విషయాలను కోర్టుకి వివరించారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. నిందితులను బహిరంగా ఉరితీయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి చిన్నారులపై అత్యాచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ పత్రికలు సైతం అసిఫా హత్యను తీవ్రంగా పరిగణిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. ఈ ఘటనపై స్పందించకపోతే మానవత్వం అనేదే చచ్చిపోయినట్లే అంటూ కథనాలు రాస్తుంది.

Posted in Uncategorized

Latest Updates