చిన్నారుల రక్త సంబంధం : తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక అక్క మృతి

died
వాళ్లిద్దరూ అక్కా, తమ్ముడు. అక్క పేరు సోనుప్రియ. వయస్సు పదేళ్లు. తమ్ముడి పేరు ప్రదీప్. వయస్సు ఐదేళ్లు. ఆ ఇంట్లో వీరి అల్లరి అంతా ఇంతా కాదు.. అరుచుకోవటం, కొట్టుకోవటం, అల్లరి చేయటం, అమ్మానాన్నలకు కంప్లయింట్స్ చేసుకోవటం.. ఇలా రోజూ ఆ ఇంట్లో అదో సందడి. ఇదంతా ఇంట్లో ఉంటేనే.. స్కూల్ కు వెళ్లే సమయంలో మాత్రం అక్క చేయి పట్టుకునే.. అక్క చూపిన దారిలోనే వెళతాడు. రోజూ తమ్ముడిని క్లాసులో దిగబెట్టిన తర్వాత ఆ అక్క తన తరగతికి వెళుతుంది. చూడముచ్చటగా ఉంటారు.. అలాంటి ఈ అక్కా తమ్ముళ్లు.. గంటల వ్యవధిలోనే చనిపోయారు. తమ్ముడి చనిపోయాడన్న విషయం తెలిసి.. అక్క షాక్ అయ్యింది. కుప్పకూలిపోయింది. తమ్ముడితోపాటు శాశ్మానానికి చేరింది. చూసేవారికే గుండెలు బరువెక్కాయి.. విన్నోళ్లకు సైతం కన్నీళ్లు ఆగలేదు.. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జాలిగామకు చెందిన పుప్పాల పద్మస్వామి దంపతులకు సోనుప్రియ (10), ప్రదీప్ (5) ఇద్దరు పిల్లలు. ఆదివారం చిన్నారి ప్రదీప్ అనారోగ్యానికి గురయ్యాడు. వాంతులు, విరేచనాలు. తల్లి పద్మ మందులు వేసింది. రాత్రికి పాలు, రొట్టెలు ఇచ్చింది. సోమవారం తెల్లవారుజామున ప్రదీప్ కు ఎక్కువగా వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రదీప్ చనిపోయాడు. 24 గంటల ముందు వరకు ఎంతో చలాకీగా ఉన్న కుమారుడు లేడన్న విషయాన్ని ఆ కుటుంబాన్ని జీర్ణించుకోలేకుండా చేసింది. ప్రదీప్ మృతదేహాన్ని ఉదయం ఏడు గంటల సమయంలో ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ సోనుప్రియ నిద్రపోతుంది. గ్రామస్తులు, చుట్టుపక్కల వారు వచ్చారు. రోదనలు మిన్నంటాయి. ఏంటీ గొడవ అంటూ సోనుప్రియ నిద్ర లేచి బయటకు వచ్చింది. ఎదురుగా తమ్ముడు ప్రదీప్ నిర్జీవంగా పడి ఉన్నాడు. రాత్రి వరకు తనతో ఆడుతూ పాడుతూ తిరిగిన తమ్ముడు.. అక్కా అక్కా అంటూ వెంటపడేవాడు.. అల్లరి చేసే తమ్ముడు లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. తమ్ముడిని పట్టుకుని పెద్ద పెద్దగా ఏడుస్తూ అలాగే కుప్పకూలిపోయింది. ఉలుకూ పలుకూ లేదు. వెంటనే సోనుప్రియను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. గంట అంటే గంట సమయంలోనే.. తమ్ముడితోపాటు అక్క కూడా వెళ్లిపోయింది. గ్రామం మొత్తం షాక్ అయ్యింది. ఎంత ప్రేమ ఉంటే.. తమ్ముడితోపాటు అక్క కూడా వెళ్లిపోతుంది అంటూ అందరూ కన్నీరుమున్నీరు అయ్యారు. ఆ తల్లిదండ్రులను పట్టుకోవటం ఎవరి వల్లా కాలేదు.. కళ్లెదుట.. గంట సమయంలోనూ పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్లిపోవటంతో నిత్తేజంగా పడి పోయారు. ఈ చిన్నారుల రక్త సంబంధం..

Posted in Uncategorized

Latest Updates