చిన్నా, పెద్ద తేడా లేదు : కొత్తగా 9 వేల 200 మంది పంచాయతీ కార్యదర్శుల నియమకం

రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం కొత్తగా 9 వేల 200 మంది పంచాయతీ కార్యదర్శులను నియమిస్తామన్నారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి, 2 నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఉండాలని సూచించారు. కొత్తగా నియామకమయ్యే 9 వేల 200 మంది  పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని…. ఆ తర్వాత పనితీరు ఆధారంగా వారిని క్రమబద్దీకరించాలని చెప్పారు సీఎం. విధులు నిర్వహించలేని వారిని క్రమబద్దీకరించకుండా ఉండేలా విధానం రూపొందించాలని సూచించారు. ప్రొబేషన్ సమయంలో నెలకు 15 వేల చొప్పున జీతం ఇవ్వాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోనే, జిల్లా కేడర్ లో కార్యదర్శుల నియామకాలు జరపాలని ఆదేశించారు సీఎం.

 

నియామక ప్రక్రియ, పంచాయితీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు తదితర అంశాలపై విధి విధానాలు రూపొందించాల్సిందిగా పంచాయిత్ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ లను ఆదేశించారు. పంచాయితీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేస్తామన్నారు సీఎం.

 

Posted in Uncategorized

Latest Updates