చివరి చూపు లేకుండానే ఖననం : నిఫా వైరస్ కు చికిత్స చేస్తూ నర్సు మృతి

Nifa-virus-nurseకేరళలో తీవ్ర విషాదం. ఓ వైపు నిఫా వైరస్ విజృంభిస్తుంటే.. మరోవైపు ఆ వ్యాధికి చికిత్స చేస్తున్న నర్సులు సైతం బాధితులుగా మారుతున్నారు. ఇప్పటికే ముగ్గురు నర్సులు వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చేరారు. లినీ అనే 31 ఏళ్ల నర్సు చనిపోవటం అందర్నీ షాకింగ్ కు గురి చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కన్నీటి పర్యంతం చేశాయి. వైరస్ సోకి ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచిన లినీని నిమిషాల వ్యవధిలోనే ఖననం చేశారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా చివరి చూపునకు అవకాశం లేకుండా చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు డాక్టర్లు, అధికారులు. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన.. అయినా తప్పలేదు అన్నారు వైద్యులు. లినీని చివరి చూపునకు అవకాశం ఇస్తే.. మిగతా వారికి కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని.. అందుకే నిమిషాల్లోనే ఖననం పూర్తి చేసినట్లు ప్రకటించారు అధికారులు.

నర్సు లినీ.. మరికొద్దిసేపట్లో చనిపోతారు అనగా తన భర్తకు రాసిన లేఖ సంచలనం అయ్యింది. నిఫా వైరస్ రోగులకు చికిత్స చేస్తుండగా.. ఆ వైరస్ నాకు కూడా సోకింది. నాకు తెలుసు ఈ వైరస్ కు చికిత్స లేదని. కొన్ని గంటల్లోనే చనిపోతాను అని నాకు తెలుసు.. చివరిసారిగా మిమ్మల్ని, పిల్లలను కూడా చూడలేను అని తెలుసు. ఇది గుండెలను మరింత పిండేస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. వారిని గల్ఫ్ తీసుకెళ్లు. వారిని బాగా పెంచు. నేను లేను అని నీవు జీవితాంతం ఒంటరిగా ఉండకు. మా నాన్నలా నీ జీవితాన్ని ఒంటరితనం చేయొద్దు. అంటూ భర్తకు రాసిన లేఖ ఇప్పుడు అందరినీ కన్నీటిపర్యంతం చేస్తోంది.

నిఫా వైరస్ కు చికిత్స చేస్తూ చనిపోయిన నర్సును వీర మరణం పొందిన వనితగా కీర్తించారు వైద్యులు, ప్రజలు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ చికిత్స చేసిన నర్సు దేశసరిహద్దులో పని చేసే జవాన్ తో పోల్చారు. ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.

Posted in Uncategorized

Latest Updates