చుక్కలనంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

petrol-dieselపెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఆదివారం (ఏప్రిల్-1) డీజిల్ ఆల్‌టైమ్ హై ధరను అందుకోగా.. పెట్రోల్ నాలుగేళ్ల గరిష్ఠానికి చేరింది. ఆదివారం హైదరాబాద్‌లో డీజిల్ ధర రూ.69.74గా ఉండగా.. పెట్రోల్ ధర రూ.77.69గా ఉంది. 2017 జులై నుంచి ఆయిల్ కంపెనీలు ప్రతి రోజూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను మారుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 18 పైసలు పెరిగాయి. ధరలు పెరుగుతుండటం చూసి బెంబేలెత్తుతున్న సామాన్యులు.. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో 2014, సెప్టెంబర్ 14 తర్వాత పెట్రోల్ రూ.73.73 ధరలు గరిష్ఠాన్ని తాకాయి. ఇక డీజిల్ అయితే జీవితకాల గరిష్ఠాన్ని అందుకుంది. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతుండటంతో పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాల్సిందిగా చమురు మంత్రిత్వ శాఖ కోరినా.. బడ్జెట్‌లో అరుణ్‌జైట్లీ వాటిని పట్టించుకోలేదు.

ఈ ధరల్లో సగం పన్నులే ఉండటం వల్ల దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న దేశంగా భారత్ నిలుస్తున్నది. దీనికితోడు అంతర్జాతీయంగా ధరలు పతనమైన సమయంలో ఆ లాభం వినియోగదారులకు దక్కకుండా నవంబర్ 2014 నుంచి జనవరి 2016 మధ్య ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 9సార్లు ఎక్సైజ్‌డ్యూటీని పెంచారు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా.. గతేడాది అక్టోబర్‌లో మాత్రం రూ.2 ఎక్సైజ్‌డ్యూటీని తగ్గించారు. వ్యాట్‌ను తగ్గించాల్సిందిగా రాష్ర్టాలను కేంద్రం కోరినా.. కేవలం మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లు మాత్రమే తగ్గించాయి. పెట్రోలియం ఉత్ప‌త్తుల‌ను జీఎస్టీ కిందికి తీసుకురావాల‌న్న డిమాండ్ల‌ను కూడా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. రాష్ట్రాలు ఓకే అంటే త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని కేంద్రం చెబుతూ వ‌స్తున్న‌ది.

Posted in Uncategorized

Latest Updates