చూసొద్దాం రండి : కాళేశ్వరానికి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ

KALESHWARAMతెలంగాణలో లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ పనులపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. తెలంగాణకే తలమానికగా నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునేందు ఇటీవల రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు బస్సు యాత్ర చేపట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు బంపర్ ఆఫర్ కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ ప్రకటించింది. దీనికి సంబంధించిన బ్రోచర్‌ ను గురువారం (మే-31) సచివాలయంలో పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్‌ ఆవిష్కరించారు.  కాళేశ్వరం టూర్‌ లో భాగంగా రంగనాయకుల సాగర్‌ ప్రాజెక్టు, సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్‌ హౌస్‌ ప్రాంతాలను చూపిస్తారు. సాధారణ సమయంలో ఇక్కడికి అనుమతించరు. ప్రత్యేక ప్యాకేజీ క్రమంలో పర్యాటక శాఖ ఈ యాత్రను అందుబాటులోకి తెచ్చింది. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 టిక్కెట్‌ ధర నిర్ణయించింది. ఉదయం 7.30 గంటలకు బషీర్‌ బాగ్‌ లోని CRO ఆఫీస్ నుంచి బస్సు బయలుదేరుతుంది. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌ లోని యాత్రి నివాస్‌ కు చేరుకుంటుంది. తర్వాత అక్కడ్నుంచి కాళేశ్వరం చేరుకుంటుంది. ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు గైడ్‌ కూడా ఉంటాడని తెలిపారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates