చేతులు కాలాక : నీరవ్ మోడీ పాస్‌పోర్ట్‌ సస్పెన్షన్

nirav-modiపంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(PVB) లో సుమారు రూ. 11,400 కోట్ల కుంభకోణం కేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సమన్లు జారీ చేశారు. నీరవ్‌తో పాటు ఆయన బిజినెస్ పార్టనర్ మెహుల్‌ చోక్సీకి సమన్లు ఇచ్చారు. వారం రోజుల్లోగా వీరిద్దరూ ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ దేశంలో లేకపోవడంతో వారి వ్యాపార సంస్థల డైరెక్టర్లకు ఈ సమన్లు అందజేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు చెందిన ముంబైలోని ఓ శాఖలో రూ. 11,400కోట్ల కుంభకోణం  జరిగింది. నీరవ్‌మోడీ, మరో నగల కంపెనీ తమ బ్యాంకు ద్వారా మోసపూరిత లావాదేవీలపాల్పడినట్లు పీఎన్‌బీ ఫిర్యాదు చేసింది.

PVB  నుంచి అక్రమంగా లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌లను తీసుకెళ్లి విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచి రుణాల పొందినట్లు తెలిపింది. దీంతో విచారణ చేపట్టిన ED అధికారులు గురువారం(ఫిబ్రవరి-15) నీరవ్‌ మోడీకి చెందిన పలు షోరూంలు, ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో రూ. 5,100 కోట్ల విలువైన వజ్రాలు, నగలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. శుక్రవారం(ఫిబ్రవరి-16) కూడా నీరవ్ మోడీకి సంబంధమున్న 50కిపైగా సంస్థలపై దాడులు జరిపారు. నీరవ్‌, ఆయన భార్య, సోదరుడు, చోక్సీపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ సూచనతో నీరవ్ మోడీ, చోక్సీల పాస్‌పోర్ట్‌లను నాలుగు వారాలపాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది.

మరోవైపు ఈ కుంభకోణం వెలుగుచూడటానికి చాలా రోజుల ముందే(ఈ ఏడాది జనవరి-1న) నీరవ్‌, ఆయన కుటుంబసభ్యులు, వ్యాపార భాగస్వామి దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో నీరవ్‌ ఆచూకీ కోసం సీబీఐ అధికారులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం నీరవ్‌ మోడీ న్యూయార్క్‌లో తన లగ్జరీ జువెల్లరీ స్టోర్‌కు దగ్గర్లో JW మారియట్ ఎస్సెక్స్‌ హౌజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates