చేనేత కార్యక్రమాలపై…జిల్లా స్ధాయిలో సదస్సులు


చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది సర్కార్. మొదటి సదస్సును సిద్దిపేట జిల్లాలో నిర్వహించాలని ప్లాన్ చేసింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, మగ్గాల ఆధునికీకరణ వంటి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది..

సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలోని చేనేత కార్మికుల సమస్యలపై సెక్రటేరియట్ లో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సమీక్ష చేశారు. సిద్దిపేట గొల్లభామ చీరకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని గోల్కొండ షోరూమ్ లలో వీటిని అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. దీనికోసం సిద్దిపేటలోని గొల్లభామ చీరలు నేసే 30 మంది చేనేత కార్మికులకు జాఖాత్ లు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు అధికారులను కోరారు.

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని చేనేత కార్మికులకు వర్కింగ్ క్యాపిటల్ త్వరగా ఇచ్చేలా చూడాలని సూచించారు మంత్రి కేటీఆర్. చేనేత కార్మికుల నుంచి గ్యారంటీలు కోరకుండా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సాయం అందించే విషయాన్ని పరిశీలించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. చేనేత కార్మికుల రుణమాఫీ అంశాలపై కూడా సమీక్షలో చర్చ జరిగింది.
సిద్దిపేట, దుబ్బాకలో ప్రత్యేక చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు. దుబ్బాక, చేర్యాల, సిద్దిపేటలోని అసంపూర్తిగా ఉన్న సోసైటీల భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు టెక్స్ టైల్ డిపార్ట్ మెంట్ నుంచి అవసరమైన నిధులు మంజూరు చేయాలని హరీష్ కోరగా, మంత్రి కేటీఆర్ ఓకే చెప్పారు.. ఈ సమీక్ష లో చేనేత శాఖ అధికారులు బతుకమ్మ పండగ సందర్భంగా ప్రజలకు ఇచ్చే చీరలను మంత్రులకు, ప్రజాప్రతినిధులకు చూపించారు. వీటిని పరిశీలించిన డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates