ఏప్రిల్ ఒకటో తేదీ ఆదివారం ఉదయం 11 గంటల 30నిమిషాలకి చైనా స్పేస్ ల్యాబ్ తియాంగోంగ్-1 భూమిని తాకనుంది. విష వాయువులను మోసుకొస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో పడితే నష్టం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా న్యూయార్క్, బార్సిలోనా, బీజింగ్, చికాగో, రోమ్, ఇస్తాన్ బుల్, టొరెంటో వంటి నగరాల్లో ఎక్కడో ఓ చోట ఈ శాటిలైట్ పడే అవకాశాలు ఉన్నాయని మాత్రం హెచ్చరిస్తున్నారు. భూ కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాతే ప్లేస్ ఎక్కడ అనేది చెప్పగలం అంటున్నారు. దీంతో ఆయా దేశాల్లోని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఆయా దేశాల్లోని రక్షణ శాఖ కూడా అలర్ట్ అయ్యింది. 43 మైళ్ల ఆటిట్యూడ్ తో ఇది భూమిపై పడనుంది.
చైనా స్పేస్ ల్యాబ్ తియాంగోంగ్-1 ఓ స్కూల్ బస్సు సైజులో ఉంటుంది. దీని బరువు తొమ్మిది టన్నులు. ప్రస్తుతం భూమికి 196.4 కిలోమటర్ల పైన ఉంది. భూవాతావరణంలోకి ప్రవేశించగానే స్పేస్ ల్యాబ్‌లోని ఇంధనం మండిపోతుందని చెబుతున్నారు. దీంతో మూడో వంతు స్పేస్ ల్యాబ్ బూడిదగా మారిపోతుందని.. ఒక భాగం మాత్రమే భూమిపై పడుతుందని చెబుతున్నారు. అంటే 3 టన్నుల బరువు ఉన్న శాటిలైట్ భాగాలు భూమిని తాకే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పరిస్థితిని ఐక్యరాజ్యసమితితో సహా అంతర్జాతీయ ఏజెన్సీలకు చైనా రక్షణశాఖ ప్రతినిధి రెన్ గౌంగింగ్ సమాచారం ఇచ్చారు. 2011లో చైనా ప్రయోగించిన తియాంగోంగ్-1 రెండేళ్లు సేవలు అందించటానికి అంతరిక్షంలోకి పంపించారు. ఇది ఐదేళ్లు సేవలు అందించింది. రెండేళ్లుగా గతితప్పి భూమి చుట్టూ చక్కర్లు కొడుతుంది.