‘చోర్ మోడీ’ ఎఫెక్ట్… కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ దివ్య స్పందనపై FIR

యూపీ : కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ దివ్యస్పందనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో లోని గౌమతి నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని “చోర్ మోడీ” చుప్ హై అని కామెంట్ చేసి ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేయడంతో ఆ ఫొటో వైరల్ అయ్యింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు పెట్టారు.

ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిష్టను దివ్యస్పందన దిగజార్చారంటూ న్యాయవాది సయ్యద్ రిజ్వాన్ అహ్మద్ యూపీలో పోలీసులకు కంప్లయింట్ చేశారు. తన నుదుటిపై తానే చోర్ (దొంగ) అని ప్రధాన మోడీ రాస్తున్నట్టుగా ఉన్న ఫొటోను మార్ఫ్ చేసి ట్విట్టర్ లో దివ్య స్పందన పోస్ట్ చేసిందని.. ఇది దేశ ప్రధానికి.. దేశానికి జరిగిన ఘోరమైన అవమానమని సయ్యద్ రిజ్వాన్ అన్నారు.

పోస్ట్ పరిశీలించిన పోలీసులు ఎఫ్ఐర్ రిజిస్టర్ చేశారు. “ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రధానమంత్రిపై ద్వేషం చిమ్ముతూ… అతని ప్రతిష్ఠను దెబ్బతీసేలా దివ్య స్పందన ట్వీట్ ఉందని… అంతర్జాతీయంగా భారత్ ను నవ్వులపాలు చేసేలా పోస్ట్ ఉందని” పోలీసులు అన్నారు. దివ్య స్పందనపై ఐపీసీ సెక్షన్ 124ఏ, ఐటీ సవరణ చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం కేసు పెట్టారు పోలీసులు.

ప్రధానిని దొంగ అని ఇటీవల విమర్శించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించి… భారత భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలంటూ..  డసో కంపెనీకి ప్రధాని ప్రతిపాదించారని ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు హోలన్ చెప్పడంతో రాహుల్ గాంధీ ఈ కామెంట్స్ చేశారు. వాటిని ఉద్దేశిస్తూ.. ఫొటోను మార్ఫ్ చేసి ట్విట్టర్ లో పెట్టారు దివ్య స్పందన.

Posted in Uncategorized

Latest Updates