ఛత్తీస్‌గఢ్‌ సీఎం సింగ్‌దేవ్‌!.. హైకమాండ్ మొగ్గు చూపే చాన్స్

ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి పీఠం కోసం కాంగ్రెస్‌ నుంచి నలుగురు పోటీపడుతున్నా చివరకు టి.ఎస్‌.సింగ్‌దేవ్‌ వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపనుంది. సింగ్‌దేవ్‌ తో పాటు, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భూపేశ్‌ బఘెల్‌, చరణ్‌దాస్‌ మహంత్‌, తామ్రధ్వజ్‌ సాహులతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం సమావేశమయ్యారు. బీజేపీ నుంచి 15 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రం హస్తగతం కావడంతో వివిధ అంశాలను వారితో చర్చించారు. ఛత్తీస్‌గఢ్‌కు ఏఐసీసీ పరిశీలకునిగా వ్యవహరించిన మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ వ్యవహారాల బాధ్యుడు పి.ఎల్‌.పునియాలతో కూడా సుధీర్ఘ చర్చలు జరిపారు రాహుల్.  సీఎం పదవి కోసం పోటీ పడుతున్న రాష్ట్ర నేతలతో సమాలోచనలు జరిపి చివరకు సింగ్‌దేవ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా సర్గుజా సంస్థానానికి టీఎస్‌ సింగ్‌ దేవ్‌ (67) 118వ వారసుడు. తమ పూర్వీకుల ఏలుబడిలో రాజధానిగా వెలిగిన అంబికాపూర్‌ నుంచే టీఎస్‌ సింగ్‌ దేవ్‌ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1983లో తొలిసారిగా ఆయన అంబికాపూర్‌ పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికై పదేళ్లపాటు కొనసాగారు. 2008లో అంబికాపూర్‌ నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2013లో రెండోసారి అక్కడి నుంచే గెలిచారు. 2014 నుంచి శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో టీఎస్‌ సింగ్‌దేవే అత్యంత ఆస్తిపరుడు. గత ఎన్నికల్లో రూ.561.50 కోట్లవరకు ఆస్తులున్నట్లు వెల్లడించిన ఆయన ఈ దఫా రూ.500 కోట్లుగా పేర్కొన్నారు. అంటే ఆయన ఆస్తుల్లో సుమారు రూ.61.50 కోట్ల మేర తగ్గుదల చోటుచేసుకోవడం గమనార్హం.

Posted in Uncategorized

Latest Updates