ఛత్రపతి శివాజీ వేషంలో ఎంపీ శివప్రసాద్ నిరసన

చిత్తూరు ఎంపీ, టీడీపీ నాయకుడు శివప్రసాద్ తనదైన స్టైల్లో పార్లమెంట్ బయట నిరసన తెలుపుతున్నారు. ఛత్రపతి శివాజీ వేషంలో ఇవాళ పార్లమెంటుకు వెళ్లారు శివప్రసాద్. శివాజీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోడీ అనుచరులు, బృందాలు శివాజీ బొమ్మలు వేసుకుంటారు గానీ.. ఆయన ఆశయాలను పాటించడం లేదని అన్నారు. ప్రజాహితం కోరుకోకుండా ప్రధాని పతనం అవుతున్నారు.. అపజయాలను మూటగట్టుకుంటున్నారని చెప్పారు. నోట్లరద్దుతో ప్రజలను.. జీఎస్టీతో చిన్న వ్యాపారులను దెబ్బ తీశారని అన్నారు.

మహిళలను ఎలా గౌరవించాలో మోడీ నేర్చుకోవాలని చెప్పారు. మహిళలు, రైతులు, అన్ని సామాజిక వర్గాలను శివాజీ ఆదరించారు కానీ… మోడీ మాత్రం మహిళల ఆభరణాలను కూడా ఎత్తుకుపోయే విధంగా పరిపాలిస్తున్నారని ఆరోపించారు. హిందూ మహిళలకు ఆభరణాలంటే ఎంతో ఇష్టమని.. వాటిపైనా మోడీ పన్ను వేయాలనుకుంటున్నారని చెప్పారు. శివాజీ ఆ రోజుల్లో వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పిన శివప్రసాద్.. నేడు మోడీ పాలనలో.. మద్దతు ధర కోసం… రైతులు వందలాది కిలోమీటర్లు ధర్నాలు, ర్యాలీలు చేయాల్సి వస్తోందన్నారు. శివాజీ తన గురువులను గౌరవిస్తే.. మోడీ మాత్రం అద్వానీ లాంటి గురువును అవమానపరిచేలా వ్యవహరించారని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలంటూ… పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి.. నినాదాలు చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates