ఛాయ్, పకోడా చర్చలతో ప్రజల దృష్టిని మళ్లిస్తోంది: అఖిలేష్

ahileshఛాయ్, పకోడా చర్చలతో ప్రజల దృష్టిని సమస్యల నుంచి బీజేపీ మళ్లిస్తోందని ఆరోపించారు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ప్రజలెదుర్కొంటున్నఅసలు సమస్యలపై ఇప్పటికైనా చర్చించాలని డిమాండ్ చేశారు. గోరఖ్‌పూర్ లోక్‌సభ ఉపఎన్నిక దగ్గర పడుతుండటంతో అఖిలేష్ ఆదివారం(ఫిబ్రవరి-18) మీడియాతో మాట్లాడారు. గోరఖ్‌పూర్ ప్రజలు పూర్తి నిస్వార్థంగా అభ్యర్థులకు ఓట్లు వేయాలని.. మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయని పార్టీలకు తమ తీర్పు ద్వారా స్పష్టమైన సందేశం ఇవ్వాలన్నారు. వాస్తవాలపై చర్చ జరగాలని… కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి అంశాలపై చర్చించాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. కేవలం ఛాయ్, పకోడా డిస్కషన్లకే పరమితమవుతున్నారంటూ ఫైర్ అయ్యారు అఖిలేష్ యాదవ్.

సామాన్యుడికే అధికారం అనే రీతిలో నరేంద్ర మోడీ గతంలో టీలు అమ్మారంటూ 2014 ఎన్నికల్లో బీజేపీ పదేపదే ప్రచారం చేయగా.. పకోడా అనే పదాన్ని ఇటీవల మోడీ విపక్షాలపై అస్త్రంగా వాడారు. పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేననంటూ ఆయన వ్యాఖ్యానించారు. మార్చి 11న గోరఖ్‌పూర్ ఉప ఎన్నిక జరుగనుంది. సమాజ్‌వాదీ పార్టీతో పీస్ పార్టీ, నిషద్ పార్టీ కలిసి పనిచేస్తోంది. నిషద్ పార్టీ అద్యక్షుడు సంజయ్ సంజయ్ కుమారుడైన ప్రవీణ్ నిషద్‌ను సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాత్మంగా వ్యవహరించి ఎస్‌పీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. గోరఖ్‌పూర్ తన సొంత నియోజకవర్గం కావడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates