జమ్ముకశ్మీర్: టెర్రరిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్

armyజమ్మూకశ్మీర్ లో.. ఉరి తరహా దాడికి ప్లాన్ చేశారు ఉగ్రవాదులు. జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు సుంజ్ వాన్ లోని ఆర్మీ క్యాంప్ లోకి చొరబడ్డారు. ఇద్దరు ఆర్మీ అధికారులను బలిగొన్నారు. ఎదురుదాడి చేసిన సైన్యం.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టింది. మిగిలిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది.

జమ్మూకశ్మీర్ లోని సుంజ్ వాన్ ఆర్మీ క్యాంప్ పై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. సుబేదార్ మదన్ లాల్ చౌదరి స్పాట్ లో ప్రాణాలొదిలారు. సుబేదార్ మహ్మద్ ఆష్రఫ్ మిర్.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 9మందికి తీవ్రగాయాలయ్యాయని.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆర్మీ అధికారి చెప్పారు.  ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మరికొంత మంది ఉగ్రవాదులు దాక్కొని ఉన్నాడని అధికారులు భావిస్తున్నారు. చనిపోయిన వారి నుంచి ఏకే 56 రైఫిల్స్, పెద్ద సంఖ్యలో గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.

సుంజ్ వాన్ ఆర్మీక్యాంప్ లోకి నిన్న తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాల టైంలో టెర్రరిస్టులు చొరబడ్డారు. సాయుధులైన ఉగ్రవాదులు భద్రతాసిబ్బందిపై కాల్పులు జరుపుతూ సైనికుల కుటుంబాల క్వార్టర్లు ఉన్న ప్రాంతంలోకి చొరబడ్డారు. ఉగ్రవాదుల కు జవాన్లకు మధ్య కాల్పుల్లో ఆర్మీ జవాన్ల కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. చాలా వరకు క్వార్టర్లు ఖాళీ చేయించారు. ఆర్మీ క్యాంప్ చుట్టు పక్కల భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు రాత్రి కూడా ఆపరేషన్ కంటిన్యూ చేశారు. చీకట్లో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించేందుకు జనరేటర్లు తీసుకొచ్చి లైట్లు ఏర్పాటు చేశారు. ట్యాంకర్లు సహా పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని ఘటనా స్థలానికి తరలించారు.

సుంజ్ వాన్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది కేంద్రం. జమ్మూకశ్మీర్ డీజీపీతో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. మరోవైపు.. టెర్రర్ ఎటాక్ తనను తీవ్రంగా కలచివేసిందని కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. డీజీపీతోపాటు.. ఇతర ఉన్నతాధికారులతో ఆమె అత్యవసరంగా భేటీ అయ్యారు. తర్వాత ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాదితులను పరామర్శించారు.

Posted in Uncategorized

Latest Updates