జమ్ముకశ్మీర్ లో గవర్నర్ పాలన

Narinder Nath Vohraజమ్మూకశ్మీర్‌లో మరోసారి గవర్నర్ పాలన విధించారు. గవర్నర్ పాలనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వెంటనే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ)తో మూడున్నరేండ్ల పాటు సాగిన పొత్తుకు బీజేపీ మంగళవారం(జూన్-19) గుడ్‌బై చెప్పింది. దీంతో మొహబూబా ముఫ్తీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనందున కేంద్రపాలన విధించాలని గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా సిఫారసు చేశారు. దీంతో ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఒక నివేదికను పంపారు. నివేదికను పరిశీలించిన రాష్ట్రపతి కోవింద్.. జమ్మూకశ్మీర్ లో గవర్నర్ పాలనకు ఆమోదం తెలిపారు.

గత 40 ఏళ్లలో ఏడుసార్లు గవర్నర్ పాలనలోకి వెళ్లిన జమ్ముకశ్మీర్‌లో మరోసారి గవర్నర్ పాలనలోకి వెళ్లింది. మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన వోహ్రా 2008 జూన్ 25న గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన హయాంలో మూడుసార్లు గవర్నర్ పాలన అమలైంది. మరోసారి గవర్నర్ పాలన విధించడంతో ఆయన హయంలోనే ఇది నాలుగోసారి అమల్లోకి వచ్చినట్లైంది.

Posted in Uncategorized

Latest Updates