జర్నలిస్ట్ ఆత్మాహుతి.. ట్యునీషియాలో హింసాత్మకంగా మారిన ఉద్యమం

నార్త్ ఆఫ్రికన్ దేశం ట్యునీషియా.. సామాన్యుల ఆగ్రహ జ్వాలలతో రగులుతోంది. ఆ దేశంలో మళ్లీ “2010 తిరుగుబాటు” కాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2011లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం తమ ఆకాంక్షలను నెరవేర్చడం లేదంటూ జనం రోడ్డెక్కుతున్నారు. చాలా ప్రాంతాల్లో పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. మిలటరీ ఫోర్స్ ను రంగంలోగి దింపింది అక్కడి ప్రభుత్వం. ఓ జర్నలిస్ట్ ఆత్మాహుతికి నిరసనగా.. ఆందోళనకారులు రోడ్డెక్కారు. బుధవారం పోలీసులతో జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ గొడవలకు సంబంధించి 18మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కసెరైన్ లో 13మందిని, టెబౌరా..ట్యూనిస్ నగరాల్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

నాటి ఉద్యమ ఆకాంక్షలు సాధించుకునేందుకు మరోసారి తిరుగుబాటు చేద్దాం అంటూ.. అబ్ డెర్రజాక్ జోర్గుయి అనే జర్నలిస్ట్ ఆత్మాహుతి చేసుకోవడం ట్యునీషియాలో సంచలనం రేపుతోంది. ‘మా బిడ్డల కోసం నేను ప్రాణార్పణం చేసుకుంటున్నా. నిరాశ నుంచి బయటకు వచ్చి తిరుగుబాటుకు సిద్ధం కండి’ అంటూ జర్నలిస్ట్ తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న వీడియో రెండురోజులుగా ఆ దేశంలో వైరల్ అయింది. కసెరైన్ సహా.. చాలా నగరాల్లో జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలకు దిగారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. స్టేట్ భవనాలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం మిలటరీని దింపింది.

ట్యునీషియాలో నిరుద్యోగం.. ఆకలి చావులు పెరగడం, ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి పెరిగిపోవడం, కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకపోవడంతో.. జనం 2010లో తిరగబడ్డారు. 23 ఏళ్ల పాటు సాగిన ఆనాటి ప్రభుత్వంపై అన్నివర్గాల ప్రజలు ఉద్యమించారు. నిరుద్యోగం సమస్యతో ఓ వీధి వ్యాపారి మహ్మద్ బౌజిజ్ తనకు తానుగా ఆత్మాహుతి చేసుకోవడంతో 2010లో ఉద్యమ సెగ ఎగిసింది. ట్యునీషియాలో మొదలైన ఈ ఉద్యమ వేడి.. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆప్రికాలోని పలుదేశాలను.. అరబ్ ప్రపంచాన్ని తాకింది. ట్యూనీషియా అధ్యక్షుడు జైన్ ఎల్ అబిడైన్ బెన్ ఆలీ .. సౌదీ అరేబియాకు పారిపోయి తన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఐనప్పటికీ.. తమ ఆకాంక్షలు నెరవేరడం లేదంటూ స్థానికులు మరోసారి ఉద్యమబాట పట్టారు.

Posted in Uncategorized

Latest Updates