జాతరకెళ్లి.. చుక్కేసి.. : మేడారం లిక్కర్ సేల్స్ రూ.50 కోట్లు

medaram-liquorనాలుగు రోజుల మేడారం జాతర ముగిసింది. కోటిన్నర మంది వనదేవతల దర్శనంతో పులకించారు. అదేస్థాయిలో మందుబాబులు కూడా రికార్డ్ క్రియేట్ చేశారు. జస్ట్ నాలుగు రోజుల్లోనే అక్షరాల రూ.50 కోట్ల మందు తాగేశారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నాలుగు రోజుల్లో మేడారం జాతరలో ఏర్పాటు చేసిన మందు షాపులు, బార్ల ద్వారా ఈ ఆదాయం ఆర్జించింది ఎక్సైజ్ శాఖ.

22 తాత్కాలిక బార్లకు అనుమతి ఇచ్చారు. ఒక్కో బార్ నుంచి రోజుకు రూ.9వేల లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. ఈ ఫీజ్ ద్వారానే 14లక్షలు వస్తే.. 22 షాపుల ద్వారా 4 కోట్ల మందు అమ్మకాలు సాగాయి. జాతర చుట్టుపక్కల, మేడారం సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన లిక్కర్ షాపుల ద్వారా రూ.46 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. ఈ షాపుల్లో 50శాతం అధిక ధరతో విక్రయాలు సాగాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాద్, జనగాం, ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ మద్యం అమ్మకాలు పెరిగాయి. మేడారం జాతరకి మూడు కిలోమీటర్ల పరిధిలో 3వేల బెల్ట్ షాపులు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా సేల్స్ మరింత పెరిగింది.

మేడారం జాతరలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బార్లు, షాపులకు సప్లయ్ చేసిన మద్యంకి.. బేవరేజీస్ కార్పొరేషన్ కూడా 30శాతం అదనపు ధర నిర్ణయించింది. ఇప్పటి వరకు రూ.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెబుతున్న ఎక్సైజ్ శాఖ.. అధికారంగా మాత్రం రెండు రోజుల్లో ప్రకటించనుంది.

Posted in Uncategorized

Latest Updates