జిల్లాల్లో ఈ-చలాన్‌ విధానం, క్యాష్‌లెస్‌ చలాన్లు

TRAFIC POLICEట్రాఫిక్ రూల్స్ ను కఠినం చేయడంతో పాటు..టెక్నాలజీతో శాంతి భద్రతల పర్యవేక్షణ సులభతరం చేసింది పోలీస్ శాఖ. ఇప్పుడు ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పూర్తి స్థాయిలో ఈ-చలాన్‌ వ్యవస్థ, ట్రాఫిక్‌ పోలీసులకు బాడీ వార్మ్‌డ్‌ కెమెరాలు, ఆన్‌లైన్‌ ద్వారా జరిమానాల చెల్లింపు అమలు చేసి సక్సెస్ అయ్యింది. ఇప్పుడిదే తరహా లేటెస్ట్ చర్యలను అన్ని జిల్లాల్లోని పోలీస్‌ విభాగాల్లో ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడా కూడా నేరుగా జరిమానాలు స్వీకరించడం లేదు. ఈ-సేవ, క్రెడిట్, డెబిట్‌ కార్డుల ద్వారా జరిమానాల చెల్లింపులు స్వీకరిస్తున్నారు. దీని ద్వారా ట్రాఫిక్‌ పోలీసులపై వచ్చే అవినీతి ఆరోపణలకు చెక్‌పెట్టినట్టయ్యింది. ఇదే రీతిలో జిల్లాల్లోని అర్బన్‌ ప్రాంతాల్లో ముందుగా ఈ-చలాన్‌ విధానం, క్యాష్‌లెస్‌ చలాన్లను అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకుగాను అర్బన్‌ ప్రాంతాల్లో పోలీస్‌ శాఖ   ఆధ్వర్యంలో అత్యాధునిక సిగ్నల్‌ వ్యవస్థ, సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ప్రతిజిల్లాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేర నిధులు కేటాయించి ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌లో ప్రవేశపెట్టిన బాడీ వార్మ్‌డ్‌ కెమెరాలను జిల్లాలోని ట్రాఫిక్‌ అధికారులకు కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌పై పాయింట్ల విధానం ప్రస్తుతం హైదరాబాద్‌ కమిషనరేట్‌లో అమల్లో ఉంది. దీన్ని జిల్లాల్లో కూడా అమలు చేసే ఆలోచన ఉంది. ఇందుకుగాను ప్రతీ జిల్లాల్లోని రవాణా శాఖ డేటాబేస్‌ను పోలీస్‌ శాఖ డేటాబేస్‌కు అనుసంధానించేలా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని ఆయా జిల్లాల ఎస్పీలను రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు కూడా ప్రతి గురు, శుక్ర, శనివారాలు తప్పనిసరిగా నిర్వహించేలా పోలీస్‌ శాఖ నిర్ణయం తీసుకోనుంది. దీని కోసం అత్యాధునిక బ్రీత్‌ అనలైజర్లు, ఇతర సామగ్రిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు పోలీసులు. ప్రతి జిల్లాలో శాంతి భద్రతల విభాగానికి ఉన్నట్టుగానే ప్రత్యేకంగా ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ కోసం కంట్రోల్‌ సెంటర్లను ఏర్పాటుచేయాలని   భావిస్తున్నారు. దీని ద్వారా సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్‌ చలాన్‌ జనరేటింగ్,  నిబంధనలు ఉల్లంఘించేవారి జాబితా ఆన్‌లైన్‌లోనే రూపొందించడం సులభతరమవుతుంది. అదే విధంగా అర్బన్‌ ప్రాంతాల్లో రోడ్లపై జరిగే నేరాలను కూడా అరికట్టడం ఈజీ అవుతుందని భావిస్తోంది పోలీసు శాఖ.

Posted in Uncategorized

Latest Updates