జూన్ 2లోగా ప్రతీ రైతుకు పాస్ బుక్కు, చెక్కులు : కేసీఆర్

KCR RAITHUజూన్ 2లోగా రాష్ట్రంలో ప్రతీ ఒక్క రైతుకు కొత్త పట్టాదారు పుస్తకం, చెక్కుల పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. సాంకేతిక కారణాలేవైనా.. వాటిని పరిష్కరించి, అందరికీ పాస్ పుస్తకాలు, చెక్కులు ఇవ్వాలన్నారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలులోకి వచ్చే నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపిణీ పూర్తి కావాలని డెడ్ లైన్ పెట్టారు. మంగళవారం (మే-22) రైతు బంధు పథకంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో రివ్యూ చేశారు. ఇప్పటివరకు పూర్తయిన పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీపై మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపారు. భారతదేశంలో మరే ప్రభుత్వ కార్యక్రమానికి రానంత గొప్ప స్పందన రైతుబంధుకు వస్తోందని సీఎం అధికారులతో అన్నారు.

ఇదే స్పూర్తితో మిగతా రైతులకు పాసు పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేసి.. కార్యక్రమం సక్సెస్ చేయాలన్నారు. గ్రామాల్లో పంపిణీ కార్యక్రమాలకు హాజరు కాని రైతులు.. తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి పాస్ బుక్కులు, చెక్కులు తీసుకోవాలని సీఎం సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని.. వ్యవసాయ రంగానికి ఎక్కువ నిధులిస్తున్నామన్నారు సీఎం. రైతులకు మేలు చేయగలిగితేనే సాధించిన తెలంగాణకు సార్థకత అన్నారు. 12వేల కోట్లతో రైతుబంధు కార్యక్రమం అమలు చేస్తుంటే చాలా మంది భయపడ్డారనీ.. నేరుగా మేలు చేసే కార్యక్రమం కాబట్టి మొండి పట్టుదలతో ముందుకుపోయామన్నారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎక్కడికీ తిరగకుండా భూ యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చినందుకు రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవడం, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, మరికొన్ని కారణాలతో పలుచోట్ల పాస్ పుస్తకాలు, చెక్కులు రైతుల చేతికి రాలేదన్నారు కేసీఆర్. భూ రికార్డులు సరిచేసే కార్యక్రమం కూడా కొన్ని చోట్ల సరిగా నిర్వహించలేదని తెలిసిందన్నారు. ప్రభుత్వం రైతుల కోసం ఇంత చిత్తశుద్దితో పనిచేస్తున్నా అధికారులు కొన్ని చోట్ల అందుకు అనుగుణంగా విధులు నిర్వహించక పోవడం అసంతృప్తిగా ఉందన్నారు సీఎం. అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలని.. జూన్ 2లోగా ఏ ఒక్క రైతు కూడా మిగలకుండా అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు.

జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుందన్న సీఎం.. అప్పటికి అందరి దగ్గర కొత్త పాస్ పుస్తకాలుండాలని.. రికార్డులన్నీ అప్డేట్ అయి ఉండాలని సూచించారు. ఈలోగా కార్యక్రమం ఎలా నిర్వహించాలన్న దానిపై.. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రులు, కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి. రైతులకు జీవిత బీమా పథకం, కంటి వెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయితీ రాజ్ ఎన్నికల ఏర్పాట్లపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.

Posted in Uncategorized

Latest Updates