జొహన్నెస్‌బర్గ్‌ టీ20: రైనా వచ్చాడు

INDసౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా..టీ20లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. టెస్టుల్లో అద్భుత ఆటతీరు కనబర్చినా దురదృష్టవశాత్తూ సిరీస్‌ కోల్పోయిన భారత జట్టు వన్డేల్లో మాత్రం ఎలాంటి పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుంది.

ఇప్పుడు టి20ల్లోనూ తమ స్థాయికి తగినట్లుగా సత్తా చాటితే సఫారీ టూర్‌ చిరస్మరణీయంగా నిలిచిపోవడం ఖాయం. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి-18) భారత్, సౌతాఫ్రికా మధ్య వాండరర్స్‌ మైదానంలో తొలి టి20 మ్యాచ్‌ జరుగనుంది. వన్డే సిరీస్‌ గెలిచిన జట్టునే ఇక్కడా భారత్‌ కొనసాగించే అవకాశం ఉంది. అయితే టి20 సిరీస్‌ కోసమే ముగ్గురు ఆటగాళ్లు సురేశ్‌ రైనా, కేఎల్‌ రాహుల్, జైదేవ్‌ ఉనాద్కట్‌ దక్షిణాఫ్రికాకు వచ్చారు. వీరిలో రైనాకు మాత్రం చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఏడాది తర్వాత అతను భారత్‌ తరఫున మ్యాచ్‌ ఆడబోతున్నాడు. రోహిత్, ధావన్, కోహ్లిలతో టాపార్డర్‌ తిరుగులేని విధంగా ఉంది. వన్డేల్లో పెవిలియన్‌కే పరిమితమైన మనీశ్‌ పాండేకు ఈ సారైనా అవకాశం లభిస్తుందా చూడాలి. ధోని టి20 మెరుపులు చూపించి చాలా కాలమైంది. వన్డేల్లో పెద్దగా అవకాశం లభించని అతను ఫినిషర్‌గా తనకున్న గుర్తింపును మళ్లీ ప్రదర్శించాలంటే ఈ ఫార్మాట్‌ సరైన వేదిక. పాండ్యా కూడా బ్యాటింగ్‌లో చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌ పరంగా టీమిండియా అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. వన్డేల్లో సఫారీల పని పట్టిన నలుగురు మళ్లీ అదే తరహాలో ప్రత్యర్థిని చుట్టేయగల సమర్థులు. పేస్‌లో భువనేశ్వర్, బుమ్రా… స్పిన్‌లో చహల్, కుల్దీప్‌ల మంత్రం మళ్లీ పని చేస్తే ఈ సిరీస్‌ కూడా మన ఖాతాలో చేరుతుంది.

Posted in Uncategorized

Latest Updates