జోర్డాన్ రాజు అబ్దుల్లాతో ప్రధాని సమావేశం

MODIమరో విదేశీ పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. శుక్రవారం (ఫిబ్రవరి-9) నుంచి మూడు రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆయన జోర్డాన్ చేరుకున్నారు. పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ టూర్ తర్వాత ఈనెల 12న భారత్ తిరిగిరానున్నారు మోడీ. మూడు దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ పాలెం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన… మొదట జోర్డాన్ లోని అమ్మన్ చేరుకున్నారు. అక్కడ భారత అధికారులతో పాటు…జోర్డాన్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత జోర్డాన్ రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. శనివారం (ఫిబ్రవరి-10) జోర్డాన్ నుంచి ఛాపర్ లో బయల్దేరి పాలస్తీనా నగరమైన రామల్లాలోని అధ్యక్ష నివాసానికి చేరుకుంటారు మోడీ. పాలస్తీనా గడ్డపై అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా రికార్డ్ సృష్టించనున్నారు.

తర్వాత పాలస్తీనా ఫ్యాక్టో క్యాపిటల్ వెస్ట్ బ్యాంక్ కు వెళ్తారు. పాలస్తీనా మాజీ అధ్యక్షుడు యాసిర్ అరాఫత్ కు నివాళులర్పిస్తారు. పాలస్తీనా ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్ తో భేటీ అయి… రెండు దేశాల మధ్య సంబంధాలు, ఒప్పందాలపై చర్చిస్తారు. పాలస్తీనా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుధాబి చేరుకుంటారు మోడీ. అక్కడి భారతీయులతో సమావేశమవుతారు. ఎల్లుండి వీడియో లింక్ ద్వారా అక్కడ ఆలయ నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేస్తారు. తర్వాత దుబాయ్ లో UAE ప్రధాని, దుబాయ్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ తో భేటీ అవుతారు. అక్కడి నుంచి ఒమన్ వెళ్తారు మోడీ. సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్ అల్ సయిద్ తో భేటీ అవుతారు. మూడు దేశాల అధినేతలతోనూ రక్షణ ఒప్పందాలు, ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates