టార్గెట్ ఏంటీ : కెనడాలో ఇండియన్ రెస్టారెంట్ లో పేలుడు

canada

కెనడాలోని ప్రవాస భారతీయుల రెస్టారెంట్ లో పేలుడు జరిగింది. ఒంటారియోలోని బాంటే భేల్  రెస్టారెంట్ లో పేలుడుతో 18 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం రాత్రి రెస్టారెంట్ లో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పలువురు భారతీయులు హోటల్లో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.

బాంబుదాడి ఉగ్రవాదుల చర్య అని చెప్పలేం అంటున్నారు కెనడా పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని అనుమానిస్తున్నారు. వారి కోసం గాలిస్తున్నారు. పేలుడు తీవ్రతకు రెస్టారెంట్ ధ్వంసం అయ్యింది. ఈ పేలుడుపై అత్యున్నత విచారణకు ఆదేశించింది కెనడా ప్రభుత్వం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు పోలీసులు. భారతీయుల టార్గెట్ గా ఈ దాడి జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ విచారణ సాగుతుంది.

టొరంటోలోని ఇండియన్ రెస్టారెంట్ లో పేలుడుపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భారతీయులకు సహాయం కోసం 1-647-668-4108 నెంబర్ లో సంప్రదించాలని కోరారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. ఏదైనా అత్యవసరం అయితే టొరంటోలోని కాన్సులేట్ జనరల్, ఇండియన్ కమిషనర్ సాయం తీసుకోవాలని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates