టిక్ టాక్ స్టార్స్.. నెక్స్ట్ ఏంటి..?

ఇండియన్‌‌ గవర్నమెంట్‌‌ టిక్‌‌టాక్‌‌ను బ్యాన్‌‌ చేసిన తర్వాత ఎంతోమంది స్టార్లకు దిక్కు తోచడం లేదు. అందుకే చాలామంది ఆల్టర్నేటివ్‌‌ ఫ్లాట్‌‌ఫామ్స్‌‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టారు. టిక్‌‌టాక్‌‌లో ఉన్న ఫాలోవర్స్‌‌ని ఇన్‌‌స్టాగ్రామ్, యూట్యూబ్‌‌లో ఫాలో కావాలని కోరుతున్నారు. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇన్‌‌స్టాగ్రామ్, యూట్యూబ్‌‌కు కూడా యాక్టివ్‌‌ యూజర్స్‌‌ పెరుగుతున్నారు. కొంతమంది అయితే.. ఇన్‌‌స్టాగ్రామ్‌‌, యూట్యూబ్‌‌లో వాళ్ల ఫాలోవర్స్‌‌ని పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫన్‌‌ బకెట్‌‌ భార్గవ్‌‌

ఫన్‌‌ బకెట్‌‌ ప్రోగ్రాం ద్వారా ఫేమస్‌‌ అయిన భార్గవ్‌‌.. టిక్‌‌టాక్‌‌లో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌‌ ఉన్న సెలబ్రిటీ. ఇండియాలో టిక్‌‌టాక్‌‌ బ్యాన్‌‌ అవుతుందని విన్నప్పుడు ఆయన దాన్ని ఒక జోక్‌‌గా తీసుకున్నాడు. కానీ.. తాను ఊహించినట్టు జరగకపోవడంతో విస్తుపోయాడు. ఆయనది ఆంధ్రప్రదేశ్‌‌లోని విజయనగరం దగ్గరలోని ఒక చిన్న గ్రామం. పదో తరగతి వరకు చదువుకున్నాడు. విగో, టిక్‌‌టాక్‌‌లో వీడియోలు చేస్తుంటాడు. ముఖ్యంగా ‘ఓ మై గాడ్‌‌.. ఓ మై గాడ్‌‌’ వీడియోలు గత సంవత్సరం టిక్‌‌టాక్‌‌లో సెన్సేషన్‌‌ అయ్యాయి. ఆయనకు లక్షల మంది ఫాలోవర్స్‌‌ని తెచ్చిపెట్టాయి. ఒకప్పుడు స్మార్ట్‌‌ ఫోన్‌‌ లేక ఫ్రెండ్స్‌‌ ఫోన్‌‌తో టిక్‌‌టాక్‌‌ వీడియోలు చేసే భార్గవ్‌‌.. ఇప్పుడు సొంతంగా ఒక ఆఫీస్‌‌ నడుపుతున్నాడు. ఆయన దగ్గర పదిమంది పని చేస్తున్నారు. ఈ మధ్యే కారు కూడా కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ముందున్న ప్రశ్ననెక్ట్స్‌‌ఏంటి? ‘టిక్‌‌టాక్‌‌ బ్యాన్‌‌ వార్త తెలిసి రెండు రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. పోయినేడు పది మందితో ఒక టీమ్‌‌ ఏర్పాటు చేసుకున్నా. వాళ్లకు ప్రతి నెలా శాలరీ ఇవ్వాలి. ఆఫీస్‌‌ నడపాలి. ఇప్పుడు అందుకు కావాల్సిన డబ్బు ఎలా సంపాదించాలో తెలియడం లేదు. టిక్‌‌టాక్‌‌ ద్వారా ప్రతి నెలా లక్షల్లో ఇన్‌‌కం వస్తుండేది. నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. కానీ.. ఇప్పుడు మొదటి నుంచి మొదలుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అంటున్నాడు భార్గవ్. ప్రస్తుతం ఆయనకు టిక్‌‌టాక్‌‌లో  8.2 మిలియన్ల మంది ఫాలోవర్స్‌‌ ఉన్నారు.

ఫేమ్‌‌కి కేరాఫ్‌‌

గ్రామాల్లో వందలాది మంది కంటెంట్‌‌ క్రియేటర్స్‌‌ని ప్రపంచానికి చూపించింది. క్రియేటివిటీకీ కేరాఫ్‌‌గా నిలిచింది టిక్‌‌టాక్‌‌.ఒక చిన్నగ్రామంలో ఉంటున్న ఒక జంట డాన్స్‌‌ చేస్తే లోకమంతా ఫిదా అయ్యింది. గుజరాత్‌‌కు చెందిన టిక్‌‌టాక్  యూజర్‌‌‌‌ అర్మాన్ రాథోడ్ తన డాన్స్‌‌తో ప్రపంచాన్నేఆకట్టుకున్నాడు. 4.7మిలియన్ల ఫాలోవర్స్‌‌ని సంపాదించాడు. దాంతో ఆయనకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ టెరెన్స్ లూయిస్ తన ఇనిస్టిట్యూట్‌‌లో ఒక సంవత్సరం డిప్లొమా కోర్సు చేయడానికి 3 లక్షల రూపాయల స్కాలర్‌‌షిప్‌‌ ఇచ్చాడు.

‘బుర్రపాడు’ డైలాగ్‌‌తో ఫేమస్‌‌ అయిన శశికుమార్‌‌‌‌ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. టిక్‌‌లో వచ్చిన ఫేమ్‌‌తో ఆయనకు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. ‘నాకు ఎంతో పేరు, అవకాశాలు రావడానికి కారణమైన టిక్‌‌టాక్‌‌ ఇప్పుడు లేకుండా పోవడం చాలా బాధ కలిగిస్తుంది’ అంటున్నాడు శశికుమార్‌‌‌‌.

మహమ్మద్‌‌ తౌఫిక్‌

చెన్నైకి చెందిన మహమ్మద్ తౌఫిక్, వాళ్ల అమ్మమ్మ రాజమణి(వయసు 72 సంవత్సరాలు)తో టిక్ టాక్‌‌ చేసి లక్షల మంది ఫాలోవర్స్‌‌ని సంపాదించాడు. వాళ్లు సినిమాల్లోని డైలాగ్స్‌‌  చెప్తూ వీడియోలు తీస్తుంటారు. వాటిలో చంద్రముఖి సినిమా  డైలాగ్‌‌తో తీసిన వీడియోకు 30 మిలియన్ల వ్యూస్‌‌ వచ్చాయి. ‘నాకు ఇంత పేరు రావడానికి కారణమైన టిక్‌‌టాక్‌‌ని బ్యాన్‌‌ చేయడం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు నేను మరో ప్లాట్‌‌ఫామ్‌‌లోకి వెళ్తే మొదటి నుంచి మొదలుపెట్టాలి. కానీ.. ఇది ప్రభుత్వ నిర్ణయం, కాబట్టి ఏం చేయలేం’ అని మహమ్మద్ తౌఫిక్ అంటున్నాడు.

అందరికీ సమాన అవకాశాలు

హింసను ప్రోత్సహించే, భయంకరమైన వీడియోలను అదుపు చేయడంలో విఫలమైందని  టిక్‌‌టాక్‌‌పై కొన్నిసార్లు విమర్శలు వచ్చాయి. కానీ… కుల, లింగ, వర్ణ, పేద, ధనిక.. బేధం లేకుండా టాలెంట్‌‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది మంచి ఫ్లాట్‌‌ఫాం అయ్యింది. టిక్‌‌టాక్‌‌  వాడుతున్నవాళ్లలో పంట పండించే రైతు నుంచి, ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ ప్లేయర్స్‌‌ వరకు అందరూ ఉన్నారు.

సంపాదించే అవకాశం

టాలెంట్‌‌ని నిరూపించుకోవడానికే కాదు.. డబ్బు సంపాదించుకోవడానికి కూడా మంచి అవకాశాన్ని ఇచ్చింది టిక్‌‌టాక్‌‌. బ్రాండ్‌‌ ప్రమోషన్స్‌‌, వస్తువులు అమ్ముకోవడానికి కూడా ఇది ఫ్లాట్‌‌ఫామ్‌‌గా ఉండేది. కొందరికి ఇదే మెయిన్ ఇన్‌‌కమ్‌‌ సోర్స్‌‌. శశి, భార్గవ్ లాంటివాళ్లు చాలామంది టిక్‌‌టాక్‌‌పై ఆధారపడ్డారు. ముంబైకి చెందిన ఒక టిక్‌‌టాక్‌‌ స్టార్‌‌‌‌ అయితే. ప్రమోషన్ల ద్వారా డబ్బు వస్తుందనే నమ్మకంతో ఈఎంఐలపై కొన్ని వస్తువులు కూడా కొనుక్కుంది. అయితే.. టిక్‌‌టాక్‌‌ లేకున్నా అలాంటి ఫ్లాట్‌‌ఫాంలు ఎన్నో ఉన్నాయి. అయితే.. వాటిలో వ్యూయర్‌‌‌‌షిప్‌‌ ఉంటుందా? బ్రాండ్స్‌‌ ఇంతకుముందులాగే ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తాయా? అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.

ఆల్టర్‌‌‌‌నేటివ్‌‌ ఫ్లాట్‌‌ఫామ్స్‌‌

టిక్‌‌టాక్‌‌ బ్యాన్‌‌ అయిన వెంటనే.. అందరూ ఆల్టర్నేటీవ్‌‌ యాప్స్‌‌లో తమ ఖాతాలను ప్రమోట్‌‌ చేసుకోవడం మొదలుపెట్టారు.  టిక్‌‌టాక్‌‌ బ్యాన్‌‌ వార్త తెలిసిన వెంటనే, టిక్‌‌టాక్‌‌ ఫాలోవర్స్‌‌ని మిస్‌‌ కాకూడదని వాళ్ల ఇన్‌‌స్టాగ్రామ్‌‌, యూట్యూబ్‌‌ ఐడీలను ప్రమోట్‌‌ చేసుకున్నారు. ముంబైకి చెందిన టిక్‌‌టాక్ కంటెంట్ క్రియేటర్‌‌‌‌ నీతా.. టిక్‌‌టాక్‌‌తో పాటు, ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో కూడా ఎప్పుడూ యాక్టివ్‌‌గా ఉన్నారు. టిక్‌‌టాక్‌‌ బ్యాన్‌‌ అయిన తర్వాత ఒక్క రాత్రిలోనే ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 50,000 మంది కొత్త ఫాలోవర్స్‌‌ ఫాలో అయ్యారు. అంతేకాదు నాలుగైదు రోజుల్లోనే నీతాకి ఇన్‌‌స్టాలో పెయిడ్‌‌ ప్రమోషన్స్ ఆఫర్స్‌‌ వచ్చాయి. ఇన్‌‌స్టాగ్రామ్‌‌తో పాటు చింగారి, రొపోసో లాంటి ఫ్లాట్‌‌ఫామ్స్‌‌ కూడా టిక్‌‌టాక్‌‌కి ఆల్టర్నేట్‌‌గా చాలామంది వాడుతున్నారు. అంతేకాదు భార్గవ్, నీతా లాంటి కొందరు టిక్‌‌టాక్‌‌ స్టార్లకు ఇప్పుడున్న కొన్ని ఫ్లాట్‌‌ఫాంల నుంచి కాల్స్‌‌ వచ్చాయి. వాళ్లలో ఒకరికి బ్రాండ్ అంబాసిడర్‌‌గా కూడా అవకాశం వచ్చింది. కానీ.. వాటిలో ఇదే స్థాయిలో ఫాలోయింగ్‌‌ ఉంటుందో లేదో అనే అనుమానంతో వాటిలో వీడియోలు చేయడానికి కాస్త వెనుకడుగు వేస్తున్నారు. కొందరు మాత్రం ఇప్పుడు ప్రత్యామ్నాయ యాప్‌‌లను వాడుతున్నా.. త్వరలో మళ్లీ టిక్‌‌టాక్‌‌ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

టిక్‌‌..టాక్‌‌

టిక్‌‌టాక్‌‌లో డ్యాన్స్‌‌, షార్ట్‌‌ స్టోరీలు, కుకింగ్‌‌, ఎడ్యుకేషన్‌‌, అవేర్‌‌‌‌నెస్‌‌ వీడియోలు టిక్‌‌టాక్‌‌లో పోస్ట్‌‌ చేస్తుంటారు. ఈ మధ్య 58 ఇతర చైనా యాప్స్తో పాటు టిక్‌‌టాక్‌‌ను ఇండియలో బ్యాన్‌‌ చేసిన విషయం తెలిసిందే.ఈ నిర్ణయాన్ని ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. కానీ.. కొంతమంది మాత్రం ఉపాధి కోల్పోయారు.టిక్‌‌టాక్ మాతృసంస్థ  బైట్‌‌డాన్స్. ఇది ఒక స్టార్టప్‌‌ కంపెనీ. టిక్‌‌టాక్‌‌ సుమారు 200 మిలియన్లకు పైగా డౌన్‌‌లోడ్స్‌‌తో ఇండియాలోనే చాలాపెద్ద మార్కెట్‌‌గా అవతరించింది. ఒక రిపోర్ట్‌‌ ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్‌‌లో ఇండియాలో 611 మిలియన్ల వీడియోలను యూజర్లు టిక్‌‌టాక్‌‌ నుంచి డౌన్‌‌లోడ్‌‌ చేసుకున్నారు. అందుకే వచ్చే మూడేళ్లలో ఇండియాలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు 2019 ఏప్రిల్‌‌లో బైట్‌‌డాన్స్ ప్రకటించింది.

నిషా గుర్గైన్‌‌

మోడలింగ్, డాన్సింగ్‌‌లో ఈమె చాలా పాపులర్. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లోనూ చాలామంది ఫాలోవర్స్‌‌ ఉన్నారు. 23 ఏళ్ల వయసులోనే  నేషనల్‌‌ లెవల్‌‌లో గుర్తింపు తెచ్చుకుంది. టిక్‌‌టాక్‌‌ వల్ల వచ్చిన ఫేమ్‌‌తో  2019లో  పంజాబీ మ్యూజిక్‌‌ ఆల్బమ్‌‌లో నటించే అవకాశం దక్కింది. టిక్‌‌టాక్‌‌లో 21.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె వీడియోలకు 55 కోట్లకు పైగా లైక్స్ వచ్చాయి.

గీత్‌..‌

ఈమె ఇండియన్‌‌ ఫేమస్‌‌ టిక్‌‌టాక్‌‌ స్టార్లలో ఒకరు. ఇంతకుముందు లాయర్‌‌‌‌గా పనిచేసింది. ఇప్పుడు  పూర్తిగా టిక్‌‌టాక్‌‌లో వీడియోలు తీయడానికే తన పూర్తి టైం కేటాయించింది. అమెరికన్‌‌ ఇంగ్లీష్‌‌, హ్యూమన్‌‌ రిలేషన్స్‌‌, పర్సనాలిటీ డెవెలప్‌‌మెంట్‌‌పై వీడియోలు తీస్తుంది. ఈమెకు టిక్‌‌టాక్‌‌లో కోటిమందికి పైగా ఫాలోవర్స్‌‌ ఉన్నారు.

 

Latest Updates