టిట్లీ… తుఫాన్ గా మారిన వాయుగుండం

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తుఫాన్ గా మారింది. దీంతో విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

ఒడిశాలోని గోపాల్ పూర్ కు 530 కిమీ దూరంలో కోస్తాఆంధ్ర కళింగపట్నంకి 480 కిమీ దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. వాయువ్య దిశగా 8 కిమీ వేగంతో ఈ తుఫాన్ కదులుతుండగా రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉత్తర కోస్తాఆంధ్రతో పాటు ఒడిశాలోని పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. ఈనెల 11 న ఈ తుఫాన్ గోపాల్ పూర్, కళింగపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉండగా కోస్తా ఆంధ్ర, ఒడిశాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. తీరంవెంబడి 85 కిమీవేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండగా తీరం దాటే సమయంలో గంటకి 125 కిలోమీటర్ల వేగంతో గాలులతో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. ఒడిశాలోని కొన్ని ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం తీరప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీచేయగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పెనుగాలుల తాకిడికి ఆస్తినష్టం జరిగే అవకాశం ఉందని… సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

Posted in Uncategorized

Latest Updates