టీఆర్‌ఎస్‌ కే అనుకూలం : తమ్మినేని

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు అనుకూల ఫలితాలు వస్తాయన్నారు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. టీఆర్‌ఎస్‌కు మేజిక్‌ ఫిగర్‌ కంటే తక్కువ వస్తే బీజేపీ, ఎంఐఎం మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఉత్తర తెలంగాణలో ఓటింగ్‌ పెరిగిన ప్రభావం కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలించవచ్చన్నారు తమ్మినేని. మొదట్లో టీఆర్‌ఎస్‌–ప్రజాకూటమి మధ్య హోరాహోరీ పోరు సాగినా, చివరకు టీఆర్‌ఎస్‌ పట్ల సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలు కన్పించాయన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్‌ సర్వేల్లో ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయన్నారు.

ఈ ఎన్నికలపై డబ్బు ప్రభావం తీవ్రస్థాయిలో ఉందని, దానిని అరికట్టడంలో లేదా నియంత్రించడంలో ఈసీ, పోలీసువర్గాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యారన్నారు సీపీఎం నేత తమ్మినేని. సీపీఎం–బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) 107 స్థానాల్లో పోటీచేయడం ద్వారా ప్రత్యామ్నయ విధానాలు, సామాజికన్యాయం–సమగ్రాభివృద్ధిని ప్రజల్లో చర్చనీయాంశం చేయగలిగామన్నారు. సీపీఎంగా పోటీచేసిన 26 సీట్లలో కనీసం ఒకటి, రెండుస్థానాల్లో, బీఎల్‌ఎఫ్‌ పోటీచేసిన అభ్యర్థులు 81 సీట్లలో రెండు, మూడు చోట్ల విజయావకాశాలున్నట్టు అంచనా వేస్తున్నామన్నారు వీరభద్రం.

Posted in Uncategorized

Latest Updates