టీటీడీ యూటర్న్ : ఆ 6 రోజులు దర్శనం ఉంటుంది

మొదట ఐదు రోజులు.. ఆ తర్వాత తొమ్మిది రోజులు.. ఆ తర్వాత ఆరు రోజులు.. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడి దర్వనం లేదంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఇది. చరిత్రలో మొదటిసారి పాలకమండలి తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా సంప్రోక్షణలో మూడు, నాలుగు గంటలు దర్శనం కల్పించేవారు. అయితే ఈసారి మాత్రం సామాన్యులకు దర్శనమే లేదని ప్రకటించారు. దీనిపై పీఠాధిపతులు, సామాన్యుల నుంచి విమర్శలు వచ్చిన క్రమంలో ఏపీ ప్రభుత్వం దిగి వచ్చింది. నిర్ణయాన్ని మార్చుకుంది. ఆగస్ట్ 11 నుంచి 16వ తేదీ వరకు ఆరు రోజులు కూడా దర్శనం కల్పించాలంటూ టీటీడీ పాలక మండలికి ఆదేశాలిచ్చింది.

మహా సంప్రోక్షణ జరిగే ఆ 6 రోజులు.. రోజుకి 20 నుంచి 25వేల మంది భక్తులను దర్శనం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని టీటీడీ బోర్డుని ఆదేశించింది. దర్శనం నిలిపివేత నిర్ణయంపై భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఆగమ శాస్త్రానుసారం పూజ కార్యక్రమాలు నిర్వహించాలని, గతంలో పాటించిన నిబంధనలే పాటించాలని సూచించారు సీఎం చంద్రబాబు. నిబంధనల్లో మార్పులు చేయొద్దని కోరారు. గతంలో నిర్వహించిన విధంగా ఈసారి కూడా భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించటంతో.. టీటీడీ కూడా వెనక్కి తగ్గింది.

Posted in Uncategorized

Latest Updates