‘టీనేజర్ల’తో పేరెంట్స్ కన్‌‌ఫ్యూజన్‌‌

టీనేజర్లని  కంట్రోల్ చేసెయ్యాలి అని ఎక్కువ రూల్స్ పెట్టటం, కఠినంగా ఉండటం ఏమాత్రం మంచిది కాదు. ఇంట్లో మనం చెబుతున్నవిషయాలకు టోటల్‌‌ అపోజిట్‌‌గా ఉన్న ప్రపంచాన్ని చూస్తూ ఇల్లూ, తాము చూస్తున్న సొసైటీ రెండింటి మధ్య కాస్త కన్‌‌ఫ్యూజ్ అవుతారు పిల్లలు. ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే టీనేజర్లని డీల్ చేయటం చాలా ఈజీ.

టీనేజ్ అంటేనే లైఫ్ మొత్తం లో మోస్ట్ కన్‌‌ఫ్యూజన్ పార్ట్ అంటారు. మామూలుగా మన లైఫ్ లో ఎప్పుడూ ఉండనంత గందరగోళం ఉండేది టీనేజ్ లోనే. అటు బాల్యానికీ ఇటు అడల్ట్ ఏజ్ కీ మధ్యలో ఉండే ఈ పిరియడ్ ఆఫ్ టైం ఈ టీనేజ్.

టీనేజ్ పిల్లలతో ఏదైనా వాళ్ళకి ఇష్టమైన పని వద్దు అని అన్నామా ఇక ఆరోజు ఇంట్లో యుద్ధమే. తిండి మానేయటం, సైలెంట్ గా ఉండిపోవటం, అందరి మీదా అరవటం ఇలా రోజుల తరబడి అలకలో ఉండిపోతారు. ఎదిరించి మాట్లాడటం, అబద్దాలు చెప్పటం కూడా ఇదే ఏజ్ లో ఉంటుంది.  వయసు వచ్చేకొద్దీ సమస్యలు కూడా పెరుగుతుంటాయని అనుభవంతో అనుకుంటారు. నిజమే! టీనేజ్‌‌ పిల్లలతో మనస్పర్ధలు రావడం సహజమే. వాళ్లు ఇలా ప్రవర్తించేందుకు కూడా కారణాలున్నాయి. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారంటే శారీరక మార్పులు మాత్రమే కాదు మానసికంగా కూడా ఎదుగుతున్నారన్నమాట గుర్తుంచుకోవాలి.

అలాంటి బిహేవియర్ తప్పుకాదు

పిల్లలు గా ఉన్నంతకాలం ‘ఇదివద్దు, ఫలానా పని ఇలాగే చేయాలి’ లాంటి ఆర్డర్స్‌‌కి ఏం మాట్లాడకుండా బుద్ధిగా తల ఊపేసిన బుద్ధిమంతులైన పిల్లలు కూడా. పద్నాలుగూ, పదిహేనుల్లోకి వచ్చేసరికి  మాత్రం చిరాకు చూపిస్తారు, ఏదైనా చెప్పబోతే ‘నాకు తెలుసు’ అంటూ ఎదురు మాట్లాడతారు. దానిని పొగరని అనుకోకపోవటం తల్లిదండ్రులు చేయాల్సిన మొదటిపని, మరేమనుకోవాలి-యవ్వనంలోకి అడుగుపెట్టిన పిల్లలు కొత్త అవతారం ఎత్తుతారు. ఇంట్లో కొత్తగా పెట్టిన హోమ్‌‌రూల్స్‌‌ నుంచి  స్వతంత్రం, సొంత అభిప్రాయాలకు కాస్త విలువ, వ్యక్తిగత విషయాల్లో పర్సనల్ స్పేస్ కోరుకుంటారు. అలాంటి బిహేవియర్ తప్పుకాదు. బాడీలో వచ్చే మార్పులు, పెద్దవాళ్లం అయిపోయాం అనే ఆలోచన వాళ్లలో ఉండే ఈ తరహా బిహేవియర్ కి కారణం.

చాలా సెన్సిటివ్‌‌గా చూసుకోవాలి

ఇలాంటి మార్పులన్నింటినీ చూసి ఏదో జరిగిపోతుంది, పిల్లలు పాడైపోతున్నారని అనుకొని వాళ్ళని కంట్రోల్ చేసెయ్యాలి అని ఎక్కువ రూల్స్ పెట్టటం, కఠినంగా ఉండటం ఏమాత్రం మంచిది కాదు.  చాలా సెన్సిటివ్ గా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సైకో అనలిస్టులు చెబుతున్న మాట. ఇంట్లో మీరు చెప్తున్న విషయాలు వేరు. బయట ప్రపంచాన్ని చూస్తూ వారు తెలుసుకున్నది వేరు. దీంతో తాము చూస్తున్న సొసైటీ రెండింటి మధ్య కాస్త కన్‌‌ఫ్యూజన్ కి గురవుతారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే టీనేజర్లని డీల్ చేయటం చాలా ఈజీ.

ఆత్మహత్య ఆలోచనలు

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన ఒక  రిపోర్ట్ ప్రకారం 15 నుంచి 19 ఏళ్ల వయసువారిలో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో మనదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. ప్రపంచంలో చాలా దేశాల్లో పేదరికం అనుభవిస్తున్న ప్రాంతాల్లో ఆత్మహత్యలు నమోదవుతుంటే మన దేశంలో మాత్రం బాగా చదువుకున్న, ఇంట్లో అన్ని వసతులు అనుభవిస్తున్న వర్గాల్లోనూ ఆత్మహత్యల ఆలోచనలు పెరుగుతున్నాయి. అక్షరాస్యత, ఆదాయం ఎక్కువగా ఉన్న దక్షిణాదిలోనే యువత ఆత్మహత్యలు ఎక్కువని తేలింది. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో యువత ఆత్మహత్యలు ఏకంగా 10 రెట్లు ఎక్కువ. ప్రతీదానికీ తొందరగా హర్ట్ అవ్వటం, వెంటనే రియాక్ట్ అవ్వటం టీనేజ్ లోనే ఎక్కువ. ఏ సమస్యనైనా అనలైజ్ చేసి ఆలోచించేంత మెచ్యూరిటీ రాదు. చిన్న మాటని కూడా పెద్ద అవమానం అనుకుంటారు, మార్కులు తక్కువ వచ్చినా, స్కూల్ లో టీచర్ తిట్టినా, ఇంట్లో టీవీ రిమోట్ దగ్గర అమ్మా నాన్నా మందలించినా, ఆఖరికి మొటిమలు ఎక్కువగా వస్తున్నా చాలు దాన్ని పెద్ద సమస్య అనుకునే దాకా వెళ్తారు. అందుకే టీనేజ్ లో ఉండే పిల్లలని పసివాళ్లకన్నా ఎక్కువ కేర్‌‌గా చూసుకోవాలి.

పెరుగుతున్న  ఒత్తిడి

సరిగా చదువుకోకపోతే,ర్యాంకు రాకపోతే, అమ్మనాన్నల పరువు పోతుందనీ, చిన్న కోర్సులు చేస్తే చుట్టాలు నవ్వుతారనీ ఆలోచించే టీనేజర్లలో విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. కొన్నిసార్లు చదవలేదని తల్లితండ్రులు అడిగితే చాలు ‘చచ్చిపోతాం’ ‘ఇంటినుంచి పారిపోతాం’ అని పెద్దవాళ్లను భయపెట్టే పరిస్థితులు ఉంటున్నాయి. నేటి పిల్లల్లో ఆత్మవిశ్వాసం కూడా చాలావరకూ తగ్గిపోతోంది. అందుకే ముందుగా మనకూ పిల్లలకూ ఉన్న జనరేషన్ గ్యాప్ నీ, లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పులను గుర్తించాలి. అప్పుడు పిల్లలు చేసే ప్రతి పనీ చెడుగా కనిపించడం తగ్గుతుంది.

టీనేజ్ లో ఉండే పిల్లలు కోరుకునే స్వేచ్ఛ,  వాళ్ల ఒపీనియన్స్ ఇవన్నీ వాళ్లలో కొత్తగా ఎదుగుతున్న మెంటల్ మెచ్యూరిటీని చూపిస్తాయి. వాళ్లు విషయాలను ఛాలెంజింగ్‌‌గా తీసుకోవటాన్ని గమనించాలి. తన చుట్టూ ఉన్నవాళ్లకన్నా నేను డిఫరెంట్ గా కనిపించాలి అనుకోవటం కూడా వాళ్లలో ఎదుగుతున్న ఆలోచనలకు ఒక సింబల్. అందుకే పిల్లలని కించపరచకుండా కంట్రోల్ చేయటంలో, వాళ్లు ప్రమాదాల్లో పడకుండా కాపాడుకోవటం లో బ్యాలెన్స్‌‌డ్‌‌ గా ఉంటే ఏదీ అనవసరంగా కంట్రోల్ చేస్తున్నట్టు వారికి అనిపించదు. ముఖ్యంగా పిల్లల దగ్గర పేరేంట్స్‌‌కీ, పేరెంట్స్ దగ్గర పిల్లలకీ “ఈగో” అడ్డురాకుండా ఉంటే చాలు.

వాళ్లని క్రిటిసైజ్ చెయ్యటం కాదు

అప్పటిదాకా మాట వింటూ వచ్చినపిల్లలు సడెన్ గా ఎదురు సమాధానాలు చెప్పటం, తమకన్నా ఫ్రెండ్స్ కే ఎక్కువ విలువ ఇవ్వటం చాలామంది పేరెంట్స్‌‌ని హర్ట్ చేస్తుంది. బట్టల దగ్గరనుంచీ ఫుడ్ దాకా వాళ్లు కొత్తదనం కోరుకుంటారు. ఒకప్పుడు అమ్మ ఇష్టంగా తినిపించిన వంటకంటే పాస్తానో, పిజ్జానో ఇష్టం అనేసరికి పేరెంట్స్ బాధపడతారు. లేదంటే పిజ్జా  ఎలా అనారోగ్యమో చెప్పే ప్రయత్నం చేస్తారు. సహజంగానే ఇలా చెప్పటం పిల్లలకి నచ్చదు. ‘నాకు తెలియదా, ఇంకా నేను చిన్నపిల్లని కాదు’ అనేస్తారు కూడా.

టీనేజ్ లో అడుగుపెట్టిన  పిల్లల్ని అదుపాజ్ఞల్లో పెట్టడం అంటే ఎప్పుడూ వాళ్లని క్రిటిసైజ్ చెయ్యటం కాదు. వారి ప్రవర్తన గురించి ఎవరికిపడితే వాళ్లతో చెప్పడమూ కాదు. వాళ్లకు బాధ్యత ఇవ్వాలి. వాళ్లు ఏం చేస్తున్నారో అందులో విజేతలుగా నిలబడేందుకు అవసరమైన విషయాలు వారితో మాట్లాడాలి. మనం ఇచ్చే స్వేచ్ఛని వాళ్లు ఎక్కడ చెడుదారులకోసం వాడతారో అన్న భయం వదిలేయాలి అంటే వాళ్లని మనం నమ్ముతున్నాం అనే నమ్మకం కలిగించాలి. తప్పైనా ఒప్పైనా పేరెంట్స్ తో డిస్కస్ చేయగల స్వేచ్ఛ ఉండాలి.

వాళ్ల ఎక్స్​ప్రెషన్​గానే భావించాలి

పిల్లలు మాట వినటం లేదు, ఎదురు సమాధానాలు చెబుతున్నారు అనేదే టీనేజ్ పిల్లల మీద ఎక్కువగా వచ్చే కంప్లైంట్.  అది పెద్దల మీద గౌరవం లేకపోవటం కాదు. వాళ్ల ఇండివిడ్యువాలిటీని డెవలప్ చేసుకునే క్రమంలో ఇలా మాట్లాడటం ఉంటుంది.   అంతేకాదు, పిల్లలని చదువు విషయంలోనో, మార్కుల విషయంలోనో ఇతరులతో పోల్చటం అనేది టీనేజర్ల విషయంలో పెద్ద పొరపాటు. ఆ తప్పు పేరెంట్స్ ఎప్పుడూ చెయ్యకూడనిది. కొత్త హార్మోన్స్, శరీరం లో వచ్చే మార్పులూ, ఆపోజిట్ జెండర్ మీద ఉండే క్రష్ ఇవన్నీ సాధారణ విషయాలు. ఇవన్నీ పేరెంట్స్ ఎక్కువ వ్యతిరేకంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా కేర్ తీసుకోవటాన్ని కూడా టీనేజ్ పిల్లలు భరించలేరు. అతి ప్రేమ, ఎక్కువ కేర్ వాళ్లని అనుమానిస్తున్నట్టు అనుకుంటారు. ఎదురు సమాధానాలు చెప్పటం కూడా వాళ్ల తిరుగుబాటు గా కాకుండా వాళ్ల ఎక్స్​ప్రెషన్​ గానే భావించాలి. ఎక్కువ కేర్ తీసుకోవటం వల్ల కూడా పిల్లలు పూర్తి డిపెండెంట్స్ గా మారే అవకాశం ఉంది. అందుకే పిల్లలతో పేరెంట్స్ డెమోక్రాటిక్ గా ఉండాలి, ఫ్రెండ్లీగా  మాట్లాడాలి.     పిల్లలు చేసే పనులపై ఉన్న కోపాన్ని వారిపై ఉండే ప్రేమను విడివిడిగా చూడగలగాలి. పేరెంట్స్‌‌తో  టీనేజర్లకి ఉండే ఫ్రెండ్లీ సంబంధాలు బెడిసికొట్టకుండా ఉన్నంతవరకే పెద్దల మాటపై వారికి గౌరవం, భక్తి, భయం ఉండేది. ఫ్రెండ్లీగా మాట్లాడితేనే వాళ్ళు పూర్తిగా ఓపెన్ అవుతారు, వాళ్ల ఇబ్బందులని పేరెంట్స్ కి చెప్పుకోగలుగుతారు. – విశేష్‌ సైకాలజిస్ట్, పేరెంటింగ్ కోచ్

 

Latest Updates